ఏనుగులు వస్తున్నాయి.. పవన్ కీలక ఆదేశాలు..!
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం సమీపంలో అడవి ఏనుగుల మంద సంచరిస్తూ, గ్రామాలను భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్(Pawan Kalyan) కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయాలని, వన్యప్రాణి-మానవ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి ఆధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా గజరాజుల ప్రయాణ మార్గాలను ముందుగానే గుర్తించి, ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లో రాత్రివేళల్లో ప్రత్యేక గస్తీని (Night Patrols) మరింత పెంచాలని, అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వన్యప్రాణుల రక్షణ, తక్షణ సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హనుమాన్ బృందాలను’ (రెస్పాన్స్ వాహనాలు, సిబ్బంది) వెంటనే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ రాపిడ్ రెస్పాన్స్ టీమ్లు క్షేత్రస్థాయిలో ఉంటూ ఏనుగుల మందను తిరిగి అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా మళ్లించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ కేవలం అటవీశాఖకే పరిమితం కాకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం సూచించారు. స్థానిక ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు భరోసా కల్పించాలని, గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఏనుగుల కదలికలపై రియల్ టైమ్ సమాచారాన్ని చేరవేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.








