శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ చేతుల మీదుగా ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా సాంగ్ లాంఛ్
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ
బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా సాంగ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ – బడుగుల కోసం పోరాడి బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ కాలంలో రాజు తర్వాత ఆయన వారసులే రాజులు అయ్యేవారు. అలాంటి రాచరిక వ్యవస్థను ఎదిరించి ఒక సామాన్యుడు కూడా రాజు కావొచ్చని నిరూపించాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఎన్నో కోటలు గెలిచి, చివరకు గోల్కొండ కోటను కూడా ఎదిరించాడు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన గౌరవం ఇచ్చాం. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పేందుకు స్థలం కేటాయించాం. ఆయన జయింతి వర్థంతిని ఘనంగా జరిపాం. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే బడుగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. అలాంటి వీరుడిని చరిత్రను సినిమాగా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నా. అలాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని అభినందిస్తున్నా. ఈ సినిమాను ప్రేక్షకులంతా చూసి విజయం అందించాలని కోరుకుంటున్నా అన్నారు.

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ – గౌడ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడం సంతోషంగా ఉంది. పాపన్న జీవిత చరిత్ర సినిమాగా రావాలనేది మా అందరి కల. గతంలో ఎంతోమంది ఈ సినిమా చేసేందుకు ప్రయత్నించారు. కానీ అనేక కారణాలతో సినిమా పూర్తి చేయలేకపోయారు. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను విజయవంతంగా తెరకెక్కించి, రిలీజ్ కు తీసుకొస్తున్న దర్శక నిర్మాత వెంకటేష్ గారిని, మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. సర్దార్ సర్వాయి పాపన్న కల్లు గీసే కత్తితోనే ప్రజలను పీడించే పాలకులకు గుణపాఠం నేర్పాడు. ఆయన నింపిన స్ఫూర్తి ఇప్పటికీ మా అందరినీ ముందుకు నడిపిస్తోంది. సర్వాయి పాపన్న పేరు చెబితేనే రక్తం మరుగుతుంది. అలాంటి ధీరుడి సినిమాను ప్రజలంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా సాంగ్ ను మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో వీరే సర్దార్ సర్వాయి పాపన్నలు అనిపిస్తుంటుంది. ఆయన స్ఫూర్తితో ప్రజలకు మంచి చేశారు. ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సినిమాను ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ – భూస్వాములు, పాలకులు, అధికారుల అక్రమాలను ఎదుర్కొని ప్రజలకు గొప్ప పాలన అందించిన నాయకుడు, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన జీవితం ఆధారంగా ఈ సినిమాను మా సంస్థలో నిర్మించి దర్శకత్వం వహించాను. ఈ రోజు మా మూవీ సాంగ్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ గారి చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను మా ఆర్కే గౌడ్ గారు ఈ నెల 21న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మీరంతా తప్పకుండా థియేటర్స్ లో చూడండి అన్నారు.








