అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
ఐఎస్ఐ మద్దతు వున్న షహజాద్ భట్టీ నెట్ వర్క్ ఉగ్రవాద ముఠాను భూ స్థాపితం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూప్ కి చెందిన 200 మందికి పైగా సభ్యుల్ని అరెస్ట్ చేశామని కీలక ప్రకటన చేశారు. దీంతో షహజాద్ ఎవరన్నది అందరికీ ఆసక్తి ఏర్పడింది.
పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన షహజాద్ భట్టీ దోపిడీలతో మొదలై, నేర ప్రపంచంలోకి వచ్చాడు. లాహోర్ అండర్ వరల్డ్ నెట్ వర్క్ లో కూడా అతి పేరుంది. 2013 లో పోలీసులు అతడిపై పలు కేసులను నమోదు చేశారు. ఆ తర్వాత పాక్ నుంచి యూఏఈకి మకాం మార్చేశాడు. స్క్రాప్ తో సహా పలు వ్యాపారాలు వున్నట్లు తెగ ప్రచారం చేసుకున్నాడు.
పాక్ మార్కెట్ లో ఇక పేరు పెరిగిన తర్వాత సోషల్ మీడియా వైపు వచ్చాడు. అందులో స్టార్ అయ్యాడు. మతపరమైన అంశాలు, జాతీయవాదం, ఇతర అంశాలపై నిత్యం వివాదాస్పద పోస్టులు చేసేవాడు. దీంతో ఫాలోవర్లు కూడా బాగానే వున్నారు. అంతేకాకుండా లారెన్స్ బిష్ణోయ్ కి సన్నిహితుడినని చెప్తూ వున్నాడు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి.
వీటన్నింటితో పాటు బీజేపీ సీనియర్ మిథున్ చక్రవర్తితో పాటు పలువురు ఇన్ ఫ్లూయెన్సర్లపై బెదిరింపులకు కూడా దిగాడు. 2024 మార్చిలో పంజాబ్ లోని జలంధర్ లో ఇన్ ఫ్లూయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద గ్రనేడ్ దాడి చేయడంతో దర్యాప్తు బృందాలు అతడిపై మరింత దృష్టి సారించాయి. అంతేకాకుండా భట్టీకి పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ తో కూడా సంబంధాలున్నాయి.మన భారత్ లో కూడా అతనిపై కేసులు నమోదయ్యాయి.
మరో వైపు గత నెలలో మహారాష్ట్ర ఏటీఎస్ ఓ భారీ ఆపరేషన్ ను చేపట్టింది. ఇందులో భాగంగా పాక్ కి చెందిన గ్యాంగ్ స్టర్ షహజాద్ భట్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 112 మందిని అధికారులు కూడా ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు యువతను ఆకర్షించడానికి, వారిని ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారని ఏటీఎస్ పేర్కొంది.
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న, ఐఎస్ఐ (ISI) మద్దతు కలిగిన ‘షెహజాద్ భట్టి నెట్వర్క్’పై భద్రతా దళాలు 14 రాష్ట్రాల్లో భారీ దేశవ్యాప్త తనిఖీలు (క్రాక్‌డౌన్) నిర్వహించాయి. ఈ చర్యల్లో భాగంగా 253 మందిని అదుపులోకి తీసుకోగా, 200 మందికి పైగా తీవ్రవాద ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ఇప్పటివరకు 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ దాడుల్లో ఐఈడీలు (IEDs), పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ముద్ర కలిగిన హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ గుండ్లు (లైవ్ కార్ట్రిడ్జ్లు) మరియు గూఢచర్యం కోసం ఉపయోగించే సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.








