‘భూ లక్ష్మి’తో కవిత సరికొత్త పొలిటికల్ గేమ్!
తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి అత్యంత సున్నితమైన, ప్రభావవంతమైన భూమి అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ప్రకటించిన ‘భూ లక్ష్మి’ పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రచ్చకు తెరలేపింది. ప్రతీ పేద కుటుంబానికి ఎకరం భూమిని పంచుతామని, పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరుస్తామని కవిత చేసిన ప్రతిపాదన కేవలం ఒక సంక్షేమ హామీ మాత్రమే కాదు.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లను ఒకేసారి ఆత్మరక్షణలోకి నెట్టే పక్కా వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర అవతరణ తొలి నాళ్ల వరకు దళితులకు మూడెకరాల భూమి నినాదం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. అయితే, అధికారంలోకి వచ్చాక భూముల లభ్యత లేకపోవడం, మార్కెట్ ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం కొనుగోలు చేయలేక ఆ పథకాన్ని ఆదిలోనే అటకెక్కించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కేవలం రెండు వేల ఎకరాల పంపిణీతోనే ఆ స్కీమ్ ముగిసిపోయింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే క్రమంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కుటుంబానికి రూ. 10 లక్షల పూర్తి సబ్సిడీ ఇచ్చే ‘దళితబంధు’ను తెరపైకి తెచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఆ పథకం బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిలించడమే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధుల కమీషన్ల దందా ఆరోపణలతో బీఆర్ఎస్కు రాజకీయంగా భారీ నష్టాన్నే మిగిల్చింది.
గత చేదు అనుభవాలను, వైఫల్యాలను సరిగ్గా అంచనా వేసిన కవిత.. ఈసారి సోషల్ జస్టిస్ పేరిట రీ-డిస్ట్రిబ్యూషన్ అజెండాను చేతుల్లోకి తీసుకున్నారు. గతంలో తాము ఇప్పటికే ప్రకటించిన పాంచజన్యంలోని ఉచిత ప్రైవేటు విద్య, ఉచిత ప్రైవేటు వైద్యం హామీల సాధ్యాసాధ్యాలపై విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్న వేళ, ఈ భూ లక్ష్మి బాంబు పేల్చడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గత పాలకులు చేతులెత్తేసిన అంశాన్ని తాము పక్కా అధ్యయనం, నిపుణులు, మేధావుల మేధోమథనం తర్వాతే మేనిఫెస్టోలో చేర్చామని ఆమె స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, భూదాన్ భూముల్లోనే లెక్కలేకుండా పోయిన దాదాపు లక్ష ఎకరాలను వెలికితీస్తే పేదలకు పంచడం అసాధ్యమేమీ కాదని ఆమె లెక్కలు చూపుతున్నారు. సీడ్ కంపెనీల బినామీ భూములు, అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునే రాజకీయ సంకల్పం ఉంటే భూపంపిణీ సాధ్యమేనన్నది ఆమె వాదన.
ఈ ప్రకటన ద్వారా కవిత ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం వల్లే భూ పంపిణీ జరగలేదని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ హయాం నాటి వైఫల్యాలను గుర్తుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇస్తామని, కానీ చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఈ భూపంపిణీని చేపట్టాలని డిమాండ్ చేయడం ద్వారా ప్రస్తుత పాలక పక్షాన్ని ఇరుకున పెట్టడం కవిత లక్ష్యంగా కనిపిస్తోంది. పేదల భూములను ప్రాజెక్టులు లేదా ఇతర అవసరాల పేరుతో లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించడం ద్వారా గ్రామీణ, పేద వర్గాలకు బలమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో, ఎకరం భూమి హామీ క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతుందనేది పాలనాపరంగా పెద్ద సవాలే. కానీ, రాజకీయంగా మాత్రం ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఇబ్బందికరమైన పరిణామమే. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం అనే రెండు బలమైన భావోద్వేగ అంశాలను కలుపుతూ కవిత విసిరిన ఈ ‘భూ లక్ష్మి’ పాచిక రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఏ మేరకు మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.








