ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట.. ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశం..!
IMRAN KHAN: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా… అని ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరిగింది. ఆయన చనిపోయారంటూ ఓ కథనం రావడంతో సొంతపార్టీ పీటీఐ కార్యకర్తలు వీధుల్లో నిరసనలు చేశారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో .. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.ఇమ్రాన్ ఖాన్ ను ఆస్పత్రికి తరలించాలంటూ ఆదేశించింది.ఇమ్రాన్ వైద్య నివేదికలను ఉటంకిస్తూ.. కుటుంబ సభ్యులు, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (PTI) నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాన్ని పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ స్వాగతించారు. ఈ చర్యలు ముందే తీసుకొని ఉంటే ఆయన ఆరోగ్యం ఇంతగా క్షీణించి ఉండేది కాదని పేర్కొన్నారు. ఇమ్రాన్ పూర్తిగా కోలుకునే వరకు ఆయన్ను ప్రైవేట్ వైద్యుల సంరక్షణలోనే ఉంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ వైద్య నివేదికలను తాను నిపుణులతో కలిసి పరిశీలించానని.. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని వారు చెప్పారని పేర్కొన్నారు. మూడేళ్ల జైలు జీవితం, ఒంటరితనం వల్ల ఆయన తీవ్రమైన ఒత్తిడి, మానసిక, శారీరక సంబంధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ తనకు 35ఏళ్లకు పైగా తెలుసని.. రాజకీయంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆయన ఒత్తిడిని ఎదుర్కోలేదు. కానీ, మూడేళ్ల జైలు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత ఏడు నెలలుగా తన కుటుంబం, పార్టీ నేతలు ఎలా ఉన్నారనే విషయాలతో పాటు.. బయట కూడా అసలేం జరుగుతుందో ఆయనకు తెలియదు. అందుకే ఇమ్రాన్ రోజురోజుకు మరింత కుంగిపోతున్నారు’ అని పేర్కొన్నారు.
73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత పలు కేసుల్లో చిక్కుకున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. జైలులో ఉన్నప్పటి నుంచి ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉండగా ఆయన కుడి కంటి చూపు చాలా తగ్గిపోయిందని లాయర్లు కూడా తెలిపారు.
‘తోషాఖానా’ (ప్రభుత్వ బహుమతులు), చట్టవిరుద్ధ వివాహం వంటి పలు కేసులను ఇమ్రాన్ ఎదుర్కొంటున్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు విధించిన శిక్షలపై స్టే లభించగా, మరికొన్నింటిపై అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు క్రికెట్ దిగ్గజాలు ఇమ్రాన్ జైలు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయనకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.








