హర్మూజ్ కు ప్రత్యామ్నాయం ఉత్తర ధ్రువ మార్గం…!
Arctic pole:
ప్రపంచం ఇంధన కష్టాలకు తెరపడే కాలం సమీపించిందా..? పశ్చిమాసియా యుద్ధం కొనసాగినా.. ఇంధన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరికొత్త మార్గం ఆవిర్భవించింది. ఈ దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రష్యా వెంబడి ఉత్తర ధ్రువ సముద్రం గుండా వెళ్లే 5,600 కిలోమీటర్ల మార్గం ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చనుంది. సూయజ్ కాలువ రవాణాతో పోలిస్తే ‘పోలార్ సిల్క్ రోడ్’ ప్రయాణ సమయాన్ని 10 నుండి 12 రోజుల వరకు తగ్గించనుంది.
హర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి, చమురు రవాణాకు అత్యంత కీలకం. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఒక వైపు చమురు ధరలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తవుల ధరలు కూడా పెరిగి సామాన్యుడికి భారంగా మారాయి. చమురు ఖర్చులు గుదిబండలా మారుతుండడంతో .. చిన్న,చితకా దేశాల ఆర్థిక వ్యవస్థలు గుల్లైపోతున్నాయి. ఈదశలో ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చేలా ఉత్తర ధృవం మార్గాన్ని చైనా అన్వేషించి, విజయం సాధించింది.వాతావరణ మార్పుల వల్ల ఆర్క్టిక్ ప్రాంతంలో మంచు త్వరగా కరుగుతుండటం, మంచును చీల్చుకుని వెళ్లే అధునాతన ఐస్-బ్రేకర్ నౌకల వినియోగం పెరగడంతో ఈ మార్గంలో ఏడాదంతా నౌకల రాకపోకలను కొనసాగించవచ్చు.
రష్యా ఉత్తర తీరం వెంబడి దాదాపు 5,600 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆర్క్టిక్ మార్గం, తూర్పు ఆసియాను యూరప్‌తో అనుసంధానించే సముద్ర మార్గం. సూయజ్ కాలువ లేదా ఆఫ్రికాను చుట్టి వెళ్లే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గాల్లో యూరప్ చేరడానికి 40 నుంచి 50 రోజులు పడుతుంది. కానీ ఆర్క్టిక్ మార్గంలో కేవలం 18 నుంచి 20 రోజుల్లోనే చైనా నుండి యూరప్ చేరుకోవచ్చు! ప్రయాణ సమయం సగానికి సగం తగ్గడంతో, కంటైనర్ నౌకలకు కోట్లాది రూపాయల ఇంధన వ్యయం, ఆపరేషనల్ ఖర్చులు ఆదా అవుతాయి. ఒకప్పుడు సాధ్యపడదు అనుకున్న ఆర్క్టిక్ మార్గంలో రవాణా ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్‌కు సరికొత్త జీవనాడిగా మారనుంది!
భారత్ కూడా ఆర్క్టిక్ షిప్పింగ్ రూట్ పట్ల ఆసక్తిని కనబరిచింది. ఇంధన భద్రతకు భారత్ కు ఈ మార్గం వ్యూహాత్మకంగా మారనుంది. రష్యాలో లభించే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువును (LNG) భారత్ దిగుమతి చేసుకోవచ్చు. మధ్యప్రాచ్యంలో సంక్షోభాలు తలెత్తినప్పుడు సూయజ్ కాలువ, హర్ముజ్ పై ఆధారపడకుండా, యూరప్ దేశాలకు భారతీయ ఉత్పత్తులను వేగంగా ఎగుమతి చేయడానికి ఇది అనువైన మార్గం కానుంది. ఆర్క్టిక్ సముద్ర మార్గం సాధ్యసాధ్యాలను అంచనా వేసేందుకు 2027లో భారత్ తన తొలి సరుకు రవాణా నౌకను పంపేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.








