అమెరికా సైనికుల తలకు ఇరాన్ వెల.. పట్టిస్తే రూ.28లక్షలు..!
KILL OR CAPTURE: పశ్చిమాసియా యుద్ధం అత్యంత భీకరస్థితికి చేరింది. మొన్నటి వరకూ శాంతి ప్రక్రియకు ఇరుదేశాలు తలుపులు తెరిచే ఉంచడంతో.. ఏదో విధంగా చర్చలకు ఆస్కారం ఏర్పడుతుందని ప్రపంచదేశాలు ఆశించాయి. అయితే.. తాజా పరిణామాలతో ఆ ఆశలు ఆవిరవుతున్నాయి. ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తుంటే.. గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. లేటెస్టుగా అమెరికా సైనికుల తలకు వెలకట్టడం ద్వారా ఇరాన్ మరో ముందడుగేసింది.
అమెరికాతో తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. అమెరికా సైనికులను చంపినా లేదా పట్టించినా.. 30 వేల డాలర్ల (సుమారు రూ.28లక్షలు) రివార్డు ఇస్తామని ఇరాన్ సైన్యం వెల్లడించింది. ఒకవేళ ఇదే పనిని ఇరాన్ మహిళలు చేస్తే.. వారికి రెట్టింపు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ ప్రణాళికను రూపొందించినట్లు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ వెల్లడించారు. ఇక హర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గల్ఫ్ నుంచి అమెరికా సైన్యాన్ని తరిమేశామని, మళ్లీ వారిని అనుమతించే ప్రసక్తే లేదన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయల్ సంయుక్తంగా జరిపిన దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌లో శాంతి చర్చలు జరిపిన ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన రెండు దేశాలు మళ్లీ పరస్పర దాడులు కొనసాగించాయి.








