ఇరాన్ పై అమెరికా అణుయుద్ధం చేస్తుందా..? మాజీ సెనెటర్ సంచలన ఆరోపణలు..!
“US-IRAN WAR: ఇరాన్ ను నియంత్రించేందుకు , అదుపులోకి తెచ్చుకునేందుకు అమెరికా అణుబాంబ్ వాడుతుందా..? అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు వింటే అదే అనుమానం వస్తుంది. అణ్వాయుధాలను నియంత్రించడమే తమ లక్ష్యమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ (Trump) బయటకు చెప్తున్నప్పటికీ.. ఇరాన్ పై అణు దాడులు ప్రారంభించడానికి (Nuclear Strikes) రహస్యంగా సన్నద్ధమవుతున్నారని టేలర్ గ్రీన్ పేర్కొన్నారు. త్వరలో ఈ అణుదాడులు చేయడానికి ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అణు దాడుల వల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి.. ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి.. ఆయన చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
1945లో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలను ప్రయోగించిన విషయాన్ని టేలర్ గ్రీన్ గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్లు గడిచినా జపాన్ ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ వ్యాధులు, క్యాన్సర్, పుట్టుకతో సంక్రమించే లోపాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే పరిస్థితి ఇరాన్ కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం.. తాము ఇరాన్ ను అణునిరాయుధీకరణచేయడమే లక్ష్యమంటున్నారు. అణుప్రయోగం అన్న చర్చ జరగలేదంటూ వస్తున్నారు. నయానో, భయానో ఇరాన్ ను .. ఒప్పందం దిశగా తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు ట్రంప్. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు కూడా.
మరోవైపు.. పశ్చిమాసియా సమస్యకు శాంతియుతమైన మార్గం చూడాలన్నారు ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఖతామీ. యుద్ధం జరుగుతున్నంతకాలం ప్రజలు భయపడుతూనే జీవించాల్సి ఉంటుందని ఖతామీ (Mohammad Khatami) పేర్కొన్నారు. ఈ పరిస్థితులు తొలగిపోయి శాంతియుత వాతావరణం నెలకొనేలా దౌత్య విధానాలను అవలంభించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇన్నాళ్లు బాహ్య ఒత్తిడిని తట్టుకొని ప్రభుత్వం నిలబడినప్పటికీ.. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్నారు.”








