కిమ్ దారిలోకి ట్రంప్.. సియోల్ కు షాక్..!
US-NORTH KOREA TALKS: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఊహించని విధంగా మిత్రదేశం దక్షిణకొరియాకు షాకిచ్చారు. ఆదేశంతో నిర్వహించే సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని రక్షణశాఖను ఆదేశిచంారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో ఉన్న అనుబంధం కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే సైనిక విన్యాసాలు యధావిధిగా సాగుతాయని దక్షిణ కొరియా స్పష్టం చేసింది.
ఇరాన్ విషయంలో అమెరికాకు మద్దతుగా నిలవడానికి మిత్రదేశం దక్షిణ కొరియా విముఖత వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఈ ఆదేశాలు జారీ చేశారు.‘‘కిమ్(Kim Jong Un)తో నాకున్న మంచి స్నేహ బంధం దృష్ట్యా దక్షిణ కొరియాతో అమెరికా చేపట్టాల్సిన సంయుక్త సైనిక చర్యలను తగ్గించాలని అనుకుంటున్నా. ఈ విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి. అందుకు వెచ్చించాల్సిన మొత్తంలో ఎక్కువ వ్యయాన్ని అమెరికానే భరిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది. ఇక, ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యల్లో అమెరికాతో కలిసి రావాలని దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడిని కోరగా.. ఆయన రాలేమని చెప్పారు’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
కాగా.. ఈ పోస్ట్‌కు కొద్ది గంటల ముందు కిమ్‌తో 2019లో దిగిన ఓ ఫొటోను ట్రంప్ పంచుకున్నారు. ఇక, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి మిత్రదేశాలు కూడా ఇరాన్ విషయంలో అమెరికా(United States of America)కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంపై వెనుకంజ వేస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా.. ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్’ పేరుతో అమెరికా-దక్షిణ కొరియా ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు ప్రకటించాయి. 11 రోజులపాటు ఇవి జరగనున్నాయి. ఇందులో సుమారు 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. అయితే ఈ విన్యాసాలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని సియోల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. 2018లో కిమ్‌తో అణు చర్చలు జరిపిన సమయంలోనూ ట్రంప్.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను నిలిపివేశారు. తాజాగా కిమ్‌తో మళ్లీ స్నేహపూర్వక సంబంధాలపై మాట్లాడటం, సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించడంతో ఉత్తర కొరియాతో చర్చలకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.








