‘పీఎం కేర్స్ ఫండ్ కి భారీగా నిధులు.. 8,452 కోట్లకు చేరిన ఫండ్
పీఎం కేర్స్ ఫండ్ నిధులు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ. 8,452.07 కోట్లకు వృద్ధి చెందింది. పెట్టుబడి వ్యూహాల్లో తీసుకొచ్చిన మార్పుల కారణంగానే ఈ స్థాయిలో వృద్ధి నమోదైందని తాజా ఆడిట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిధులన్నీ FD ల రూపంలో వున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ. 7,173.03 కోట్లుగా ఉన్న నిధులు, ఏడాది ముగిసే సమయానికి గణనీయంగా పెరిగాయి. గతంలో నిధులన్నీ అధికంగా సేవింగ్స్ ఖాతాల్లోనే ఉండగా, ఇప్పుడు మెరుగైన రాబడి కోసం వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించారు. ప్రస్తుతం మొత్తం నిధుల్లో రూ. 6,641 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండగా, కేవలం రూ. 605.41 కోట్లు మాత్రమే సేవింగ్స్ ఖాతాల్లో ఉన్నాయి. అంటే పీఎం కేర్స్ మొత్తం నిధుల్లో దాదాపు 92.8 శాతం ఎఫ్డీలలోనే ఉన్నాయి.
గడిచిన ఏడాదిలో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా రూ. 469.38 కోట్ల వడ్డీ లభించగా, సేవింగ్స్ ఖాతాల ద్వారా కేవలం రూ. 5.77 కోట్లు మాత్రమే సమకూరింది. వీటితో పాటు స్వదేశీ విరాళాల రూపంలో రూ. 479.04 కోట్లు, విదేశీ విరాళాల రూపంలో రూ. 92.83 లక్షలు అందాయి. వివిధ ఏజెన్సీల నుంచి మరో రూ. 324.66 కోట్ల రిఫండ్లు కూడా ఈ ఖాతాలో చేరాయి.
కరోనా సమయంలో కేంద్రం మార్చి 27 న ప్రత్యేకంగా ‘‘పీఎం కేర్స్ ఫండ్’’ పేరుతో పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. కరోనా వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, బాధితులకు సాయం చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద బ్యాంకుల్లో ప్రత్యేకంగా 10 లక్షల కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తారు. 18 ఏళ్లు నిండిన తర్వాత వారికి 10 లక్షల నుంచి ప్రతి నెలా కొంత స్లైఫండ్ ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం సొమ్మును ఒకేసారి ఇచ్చేస్తారు.








