జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అన్న అమెరికా… ఖండించిన పాక్
జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న అంశాన్నే అమెరికా మరోసారి స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్జియా గోర్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం శ్రీనగర్ కి వచ్చిన ఆయన.. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ లో పర్యటించారు. ఈ సందర్బంగా సీఎం ఒమర్ అబ్దుల్లాతో కూడా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గోర్ మాట్లాడుతూ.. ‘‘కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. ముఖ్యమైన భాగం కూడా. నేను తొలి సారి ఇక్కడికి వచ్చాను. ఇది అద్భుతమైన అందమైన ప్రాంతం. మా సమావేశం ఎంతో స్నేహపూర్వకంగా సాగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.
కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని గోర్ అన్నారు. ట్రావెల్ అడ్వైజరీని మార్చడంపై తాను ప్రస్తుతం ఎలాంటి పెద్ద ప్రకటన చేయలేనని అన్నారు.అయితే దానిని తగ్గించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలిపారు. అయితే.. ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితంగా అవ్వడానికి ఇక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని అనుకుంటున్నామని అన్నారు.
అయితే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమెరికా రాయబారి శ్రీనగర్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ను భారత్‌లోని ముఖ్యమైన భాగంగా అమెరికా రాయబారి బహిరంగంగా పేర్కొనడం ప్రాధాన్యం కలిగిన పరిణామం అని చెప్పాలి. జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ తన వాదనను కొనసాగిస్తున్న సమయంలో భారత్ వైఖరికి అనుకూలంగా అమెరికా రాయబారి మాట్లాడడం అత్యంత కీలకంగా నిలవనుంది.
ఖండించిన పాకిస్తాన్…
శ్రీనగర్ పర్యటన సందర్భంగా భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్‌ను ‘భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగం’గా అభివర్ణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ బుధవారం అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ నటాలీ బేకర్‌ను పిలిపించి ‘తీవ్రమైన నిరసన’ను తెలియజేసింది. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇస్లామాబాద్‌లోని అమెరికా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించి, జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో భాగంగా ఆయన అభివర్ణించడాన్ని తిరస్కరించింది.
ఆ వ్యాఖ్యలు ‘వాస్తవాలకు విరుద్ధం’ అని పేర్కొంది. “జమ్మూ కాశ్మీర్‌ను ‘భారతదేశంలో ఒక భాగం’గా అభివర్ణించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా తిరస్కరిస్తుంది,” అని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. “జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద భూభాగమని, సంబంధిత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోందని నొక్కిచెప్పింది,” అని ఆ ప్రకటనలో జోడించారు.








