ఘనంగా కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం…
అద్భుతమైన సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన కవికులాలంకార వేటూరి సుందరరామమూర్తి సాహితీ మహోత్సవం అమెరికాలోని డాలస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ‘వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన’ సంయుక్త ఆధ్వర్యంలో ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేటూరి విరచిత ఎనిమిది సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్య, సంగీత విభావరి నిర్వహించగా.. దాదాపు 500 మందికి పైగా సంగీత, సాహిత్యాభిమానులు విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి.. తొలి ప్రతిని విశిష్ట అతిథి ‘ఈనాడు’ దినపత్రిక సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ప్రత్యేక అతిథులు వామరాజు సత్యమూర్తి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు. అమెరికాలోని వేటూరి సాహిత్యాభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో సాహిత్య సంపుటాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించిన డా.బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా.నరసింహా రెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా.సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారథి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.
జొన్నవిత్తులతో ప్రసాద్ తోటకూర ముఖాముఖీ
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా.ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖి ఆకట్టుకుంది. పాత్రికేయుడిగా ఉన్న వేటూరి నందమూరి తారకరామారావు ఒత్తిడి మేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో రాణించడం, కవి పండితులుగా వేటూరి కవితా వైభవం, ఆయన కలం నుంచి వెలువడిన గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం, ఆయన తెలుగు భాషాభిమానం, పాత్రికేయునిగా, సంపాదకుడిగా రచనా శైలి, కేవలం వేల కొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలతోపాటు వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు తదితర అంశాలపై చర్చా కార్యక్రమం ఆసక్తికరంగా, నవ్వులు పూయిస్తూ దాదాపు గంటసేపు జరిగింది.
మధురమైన పాటలు ఎన్నో….
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వేటూరి రాసిన పాటల్లో గొప్ప పాటలు ఏవి? అని చాట్‌జీపీటీని అడిగితే.. ఆయన రాసిన వేలాది పాటల్లో కొన్ని గొప్ప పాటల్ని ఎంపిక చేయడం కష్టం అనే సమాధానం వస్తుందన్నారు. దానిబట్టి వేటూరి ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. 18 ఏళ్ల పాటు పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్)కు ఆహ్వానించి.. విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్టు వేటూరి అన్నారు. ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకం పాటనైనా అక్షరాల్లో ఆవిష్కరించగల దిట్ట అని కొనియాడారు. “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు. తెలుగు భాష ఉన్నంతవరకు వేటూరి పాటలు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ.. డా.ప్రసాద్ తోటకూర నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్‌లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలో, మళ్లీ ఇప్పుడు డాలస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సభలో పాల్గొనడం తన అదృష్టమన్నారు.
ఈ సంగీత విభావరికి రాజశేఖర్ (కీబోర్డ్), ముద్దు పాయ్ (కీబోర్డు, గిటార్), రాం యామిజాల, నీవ్ యామిజాల (పెర్కషన్), రవి మాచ, రవి రావు భట్టిప్రోలు (సౌండ్ ఇంజనీరింగ్) అందించిన సాంకేతిక సహకారం మరింత శోభను తెచ్చింది. మొత్తంగా 14 వేటూరి పాటలను ఈ సంగీత విభావరిలో ఆలపించారు.

‘ఓం నమః శివాయ..’ (సాగర సంగమం) గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు నృత్యం చేశారు. ‘జగతి సిగలో జాబిలమ్మకు..’ (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్, యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల చేసిన నృత్యం కనువిందు చేసింది. ‘నెమలికి నేర్పిన నడకలివి..’ (సప్తపది) పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం ఆకట్టుకుంది. అనంతరం ‘మధుర మధురతర మీనాక్షి..’ (అర్జున్) గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలనుల నృత్యం అలరించింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులు మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాండర్‌సన్‌ను గోపాల్ పోనంగి, డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు. ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియాలో ఎనిమిదేళ్ల వయసులోపు పిల్లలకు జరిగిన చదరంగం పోటీలలో అమెరికా నుంచి పాల్గొని పాన్ అమెరికన్ ఛాంపియన్‌గా నిలిచి స్వర్ణ పతకం సాధించిన సరయు తలపనేనిని.. టెక్సాస్ కాంగ్రెస్ సభ్యుడు మ్యాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయ తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిని అభినందించారు.
ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు సహకరించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరి, శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి తదితరులకు గోపాల్ పోణంగి కృతజ్ఞతలు తెలిపారు.








