మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన చర్యలు తీసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao)ను ఈడీ (ED) అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ (Arrest) చేశారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం విచారణ నిమిత్తం బషీర్బాగ్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన మద్యం రవాణా టెండర్లలో విపరీతమైన అక్రమాలు జరిగాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుపుతూ ఈ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు కారుమూరి కుటుంబంపై ఉన్నాయి. ఇదే మద్యం రవాణా స్కామ్ వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ (Sunil Kumar)ను గత జూన్ నెలలోనే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్ అరెస్ట్ తర్వాత సోదాలు, విచారణలు వేగవంతం చేసిన ఈడీ, ఇప్పుడు మాజీ మంత్రిని కూడా నేరుగా అదుపులోకి తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. విచారణ అనంతరం ఆయనను ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.








