రష్యా నుంచి చమురు కొంటే 500శాతం ట్యాక్స్.. కఠిన ఆంక్షల దిశగా అమెరికా..!
పశ్చిమాసియా సంక్షోభంలో భారత్ కు అండగా నిలిచింది రష్యా. భారత్ కు కావాల్సిన చమురును సరఫరా చేస్తూ ఆదుకుంది. ఓరకంగా చెప్పాలంటే ఇది రష్యాకు కూడా మంచి అవకాశంగా మారింది. దీంతో లక్షలాది టన్నుల చమురును భారత్ కు విక్రయించింది. ఫలితంగా ఇటు భారత్ కు అవసరాలు తీరగా.. రష్యాకు ఆదాయం తెచ్చిపెడుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా ఓ కఠిన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసేలా ప్రయత్నాలు ప్రారంభించింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి హెచ్చరిక పంపే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కొత్త ఆంక్షల బిల్లును తీసుకురానుంది. ట్రంప్ ప్రభుత్వంతో నలుగురు అమెరికా సెనెటర్లు ఇప్పటికే ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించారు. రష్యా యుద్ధానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలే లక్ష్యంగా చేసుకున్నారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 500 శాతం వరకు సుంకం విధించే ప్రతిపాదనను బిల్లులో పొందుపర్చారు.
ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. గతంలోనూ అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ భారత్, చైనాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగిస్తే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా జాతీయ భద్రతకు అవసరమైతే ఏదైనా దేశానికి 180 రోజుల మినహాయింపు ఇచ్చే అవకాశం బిల్లులో ఉంచారు.
ఈ బిల్లుకు అమెరికా సెనెట్‌లో ఇప్పటికే 84 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావడమే దీని లక్ష్యమని సెనెటర్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ వంటి దేశాల ఇంధన దిగుమతులు, వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








