నన్ను హత్య చేస్తే.. ఇరాన్ వినాశనమే.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు..!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ వారు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. క్షిపణుల వర్షం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 1000 క్షిపణులను లోడ్ చేసిపెట్టామని వెల్లడించారు. ఆ వెంటనే వేలాదిగా విరుచుకుపడతాయని, అందుకు సంబంధించి సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
తనను చంపడంలో ఆ దేశం సఫలమైతే.. తదుపరి ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే సూచనలు జారీ చేశానన్నారు. ‘‘ఏదైనా జరిగితే.. ఇంతకు ముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్ (Iran)పై బాంబుల వర్షం కురిపించాలని నేను సూచనలు జారీ చేశా. అయితే టెహ్రాన్ నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
హర్మూజ్‌లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఇరాన్ దాడులు చేయడం.. ఆ వెంటనే ఆ దేశంపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతో మరోసారి పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే డీల్ ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేశారు. దాంతో.. ఇప్పటికే అంగీకరించిన అంశాల్లో వేటినైనా ఉల్లంఘిస్తే ప్రతిచర్య తప్పదని ఇరాన్ హెచ్చరించింది. చర్చలను కొనసాగించాలని తాము కోరినట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించింది. తాము లొంగిపోవడంతోనే యుద్ధం ముగియదని ఇరాన్ పార్లమెంటర్ స్పీకర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు.
‘‘యుద్ధాన్ని ముగించడం ప్రపంచ దేశాలకు ప్రాధాన్యాంశం. ఇరాన్ లొంగిపోవడంతో ఎప్పటికీ ఈ యుద్ధం ముగిసిపోదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అమెరికన్లు ఎప్పుడైతే అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారో.. అప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉంటాం’’ అని వెల్లడించారు. అలాగే యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారే.. అమెరికాతో చర్చలు జరపగలరని వ్యాఖ్యానించారు.








