మళ్లీ పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ట్రంప్ ప్రయాణం..!
ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త బోయింగ్ 747 విమానం వాడకాన్ని ట్రంప్ ఎందుకు పక్కనపెట్టారు..? నాటో సదస్సు ముగిసిన తర్వాత పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి అమెరికాకు ప్రయాణించారు. అసలు పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి, కొత్త బోయింగ్ 747 విమానానికి మధ్య తేడా ఏంటి..? అకస్మాత్తుగా ఎందుకు విమానం మార్పు సంభవించింది. దీనిపై అమెరిక రక్షణ విభాగం అధికారులు ఏమంటున్నారు.?
ట్రంప్ ను ఇరాన్ టార్గెట్ చేసిందన్న ఇజ్రాయెల్ రిపోర్ట్ తో అమెరికా అప్రమత్తమైంది. పూర్తిగా భద్రత కలిగిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వాడాలని అధ్యక్షుడు ట్రంప్ నకు.. అమెరికా రక్షణ విభాగం అధికారులు సూచించినట్లు సమాచారం. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తిరిగి పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వాడాల్సి వచ్చింది. కొత్త విమానం ఈజీగా క్షిపణులకు టార్గెట్ అవుతుందన్న అనుమానాలు కూడా దీనికి ఓ కారణంగా తెలుస్తోంది.
అయితే.. విమానం మార్పుపై డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం “పాత జ్ఞాపకాల కోసం” తాను పాత విమానంలో వెళ్తున్నానని, బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్ సైనిక స్థావరంలో అమెరికా సైనికులు వీక్షించడం కోసమే కొత్త విమానాన్ని ముందే అక్కడికి పంపినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఇరాన్ హిట్ లిస్టులో తానే మొదటి స్థానంలో ఉన్నానని వ్యాఖ్యానించారు. టర్కీ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ట్రాన్స్‌పాండర్ (రాడార్ సిగ్నల్స్) నిలిపివేయడం గమనార్హం. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల పరిధి టర్కీ వరకు ఉన్నందునే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ చేరుకున్నాక విలేకరులను కిటికీల తెరలు మూసేయాలని ఆదేశించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్యవసరంగా సేవల్లోకి తెచ్చిన ఈ కొత్త ఖతార్ విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ తరహా క్షిపణి గుర్తింపు వ్యవస్థలు, తగినన్ని కమ్యూనికేషన్ యాంటెన్నాలు లేవు. కాలపరిమితి తక్కువగా ఉండటం వల్ల కొన్ని సంక్లిష్టమైన ఇంజనీరింగ్ మార్పులను పక్కనబెట్టినట్లు అమెరికా వైమానిక దళం గతంలోనే అంగీకరించింది. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చాంగ్ మాట్లాడుతూ.. కొత్త విమానంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్నాయని చెప్తూనే, అధ్యక్షుడి రక్షణ కోసం వ్యూహాత్మక దిశమార్పులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








