‘సహ’ సినిమా చాలా నచ్చింది. ఇది అందరికీ గుర్తుండిపోయే మంచి ఎమోషనల్ డ్రామా : కిరణ్ అబ్బవరం
నిశాంత్ దోటి, సుమైరా స్టూడియో ఎమోషనల్ డ్రామా ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి ‘కాలాన్నే తిరగేసి’ సాంగ్ లాంచ్
ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహ (లైఫ్ ఆఫ్ సంజు)’. నాస్టాల్జిక్ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించబోతోంది. నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ది సోల్ ఆఫ్ సాహ’ గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది.
తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ తొలి పాట ‘కాలాన్నే తిరగేసి’ను విడుదల చేసింది. ఈ పాటని ‘ఎమోషన్ ఆఫ్ సాహ’గా పరిచయం చేశారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మరోసారి తన మెలోడీ మ్యాజిక్‌ను చూపించారు. నెమ్మదిగా మొదలై క్రమంగా భావోద్వేగాలను పెంచుకుంటూ సాగే ఈ గీతం అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో అందరినీ కదిలిస్తుంది.
తన జీవితంలోని ప్రేమను కోల్పోయిన కథానాయకుడు, మళ్లీ ఆమెను కలుసుకోవాలని కలలు కంటూ అనుభవించే ఆవేదన, ఆశలను ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ‘మళ్లీ రావా’ అనే పల్లవి అతని మనసులోని తపనను హృదయానికి హత్తుకునేలా చేతుంది. పూర్ణాచారి రాసిన సాహిత్యం భావోద్వేగాలకు కవిత్వ రూపం ఇవ్వగా, అనురాగ్ కులకర్ణి తన మధురమైన వోకల్స్ తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ప్రేమని కోల్పోయిన యువకుడి పాత్రలో శివ కుమార్ కాసారం ఎంతో సహజంగా నటించారు. శ్వేత లక్ష్మణ్ కూడా తన పాత్రలో భావోద్వేగాలను అద్భుతంగా పలికిస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో వ్రజనా పాండ్యా మరో కథానాయికగా నటిస్తుండగా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘనా సునీల్, బాంబే పద్మ, కొండా రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కరుణాకర్ కె సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దినేష్ పెద్ది ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు విడుదలైన తొలి పాట కథలో సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఉందో తెలియజేస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అందరికీ థ్యాంక్యూ. నిర్మాత తేజ్ నా స్నేహితుడు. ఈ సినిమా నిర్మించిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ సినిమాతో సెటిల్ అయితే చాలని ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. శేఖర్ చంద్ర గారు అద్భుతమైన సంగీతం అందించారు. పూర్ణాచారి గారి సాహిత్యం చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు మరో పెద్ద ప్లస్ అయింది. శ్వేత చాలా చక్కగా నటించింది. తన పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆమె పెర్ఫార్మెన్స్ అందరికీ గుర్తుండిపోతుంది. నిశాంత్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రతి ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడు. శివ కుమార్‌తో నాకు షార్ట్ ఫిల్మ్స్ రోజుల నుంచే పరిచయం ఉంది. ఈ సినిమా కోసం అతను ఎంత కసితో పనిచేశాడో నాకు తెలుసు. పదేళ్ల నిరీక్షణ అతని కళ్లలో కనిపించింది. ఒక సందర్భంలో అతనితో మాట్లాడుతుంటే నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. తన జీవితం నిలబడాలనే ఆశతో ఈ సినిమా చేశాడు. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి అతనికి ఆ నమ్మకాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి మంచి జరగాలి. అందరికీ థ్యాంక్యూ సో మచ్.
దర్శకుడు నిశాంత్ మాట్లాడుతూ..ముందుగా మా నిర్మాతకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిరణ్ అబ్బవరం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన సినిమా చూసి ఎంతో గొప్పగా మాట్లాడారు. అది మాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. శేఖర్ చంద్ర గారికి ఈ కథ చాలా నచ్చింది. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే పూర్ణాచారి గారు హృదయాన్ని హత్తుకునే సాహిత్యం రాశారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలను ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేము ఒక మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు కూడా ఇదొక మంచి సినిమా అని చెబుతారనే నమ్మకం ఉంది.
హీరో శివ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా కిరణ్ అబ్బవరం గారికి ధన్యవాదాలు. ఆయన నాకు స్ఫూర్తి. ఈ సినిమా ఆయన చూసి చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పారంటే నాకు మరింత నమ్మకం వచ్చింది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. శేఖర్ చంద్ర గారు, పూర్ణాచారి గారు అద్భుతమైన పని చేశారు. శేఖర్ చంద్ర సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం మా అందరికీ మంచి భవిష్యత్తును ఇస్తుందని నమ్ముతున్నాను.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంచి టీమ్ కలిసి చేసిన సినిమా ఇది. ఈ పాట నాకు చాలా ఇష్టం. శేఖర్ చంద్ర, పూర్ణాచారి గారు అద్భుతమైన వర్క్ చేశారు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరం గారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. మంచి సంగీతం చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉన్న సినిమా ఇది. పూర్ణాచారి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. ప్రేక్షకులందరూ ఈ పాటను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.
పూర్ణాచారి మాట్లాడుతూ.. కొన్ని పాటలు మన కోసం మనమే రాస్తాం. అలాంటి పాటే ఇది. ఇందులో నాకు మంచి సన్నివేశాలు, మంచి భావోద్వేగాలు దొరికాయి కాబట్టి మనసుపెట్టి రాశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా చూస్తుంటే మనల్ని మనం చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. శేఖర్ చంద్ర గారితో నేను రాసిన పాటలకు గతంలో మంచి ఆదరణ వచ్చింది. అలాగే ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.








