మొదట తమిళ్ తాయ్ వాళ్తు’’ యే.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
తమిళనాడులో భాషా, సాంస్కృతిక గుర్తింపునకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంల రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాళ్తు’ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానం ప్రకారం తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, పీఎంకే, వీసీకే, సీపీఐ, బీజేపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీల సభ్యులు తీర్మానానికి మద్దతు తెలిపారు. అనంతరం తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సీఎం విజయ్ భావోద్వేగమయ్యారు. తమిళం అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం, మన భావోద్వేగం, సాంస్కృతిక మూలాలతో ముడిపడి వున్న అనుబంధం’’అని ప్రకటించారు.
వివాదం ఎక్కడ మొదలైంది అంటే…?
ఈ యేడాది మే నెలలో తమిళనాడులోని ఓ విశ్వ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతం, జాతీయ గేయం తర్వాత రాష్ట్ర గీతం తమిళ్ తాయ్ వాళ్తును పాడడంతో వివాదం రేగింది.అలా ఆలాపించాలని గవర్నర్ సూచించడాన్ని కొందరు తప్పుబట్టారు. విజయ్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడ తమిళ రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో పాడారు. ఈ క్రమంలోనే అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతాన్ని మొదట పాడడం తప్పనిసరి చేయాలని కోరుతూ గవర్నర్ కి లేఖ రాశారు.








