NRI ఆస్ది కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి రూల్స్ చేంజ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు ఒక NRI దగ్గర ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకుంటున్నారు. బేరం కూడా కుదిరింది. అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ముహూర్తం పెట్టుకున్నారు.అయితే ఆర్దిక లావాదేవీలు మాత్రం కొంచెం కన్ఫూజ్ గా ఉన్నారు!
ఎందుకంటే NRI ఆస్తి కొనుగోలు డీల్‌లో మీకు కనిపించని మరో పని ఉంది. అదే టీడీఎస్. అంతేకాదు, దాని కోసం మీరు TAN కూడా తీసుకోవాలి. అంటే ఆస్తి కొనడం ఒక ఎత్తు అయితే.. పన్ను లెక్కలు, TAN, టీడీఎస్ చెల్లింపులు మరో చిన్న ప్రాజెక్ట్‌లా తయారవుతున్నాయి. దాంతో ఎన్నారై ఆస్దుల అమ్మకాలు ఇబ్బంది అవుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఓ వెసులు బాటు తెస్తోంది. ఇప్పుడు ఆ టెన్షన్ కొంత తగ్గించబోతోంది. 2026 అక్టోబర్ 1 నుంచి NRI ఆస్తి కొనుగోలుదారులకు కీలక మార్పు రాబోతోంది.
అసలు ఏం మారుతుంది?
ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఒక NRI నుంచి భారత్‌లో ఆస్తి కొంటున్నారు అనుకుందాం. ఆస్తి ధరను NRIకి నేరుగా మొత్తం చెల్లించేయడం కుదరదు. వర్తించే టీడీఎస్‌ను మీరు మినహాయించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
భారత్‌లో నివసించే వ్యక్తి నుంచి ఆస్తి కొనుగోలు చేస్తే వర్తించే సాధారణ టీడీఎస్ నిబంధనలకు, NRI నుంచి కొనుగోలు చేస్తే వర్తించే నిబంధనలకు తేడా ఉంటుంది. NRI విషయంలో రూ.50 లక్షల పరిమితి ఉందని అనుకోవద్దు. అంటే “నా ఆస్తి విలువ రూ.50 లక్షల కంటే తక్కువే కదా.. TDS ఎందుకు?” అని అనుకుంటే పొరపాటే కావచ్చు.
మరి TAN ఎందుకు?
ఇప్పటివరకు NRI నుంచి ఆస్తి కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తి లేదా HUFకు టీడీఎస్ మినహాయించి ప్రభుత్వానికి చెల్లించడానికి TAN అవసరమయ్యేది. అంటే మీరు ఇల్లు కొనడానికి బయలుదేరితే.. ముందుగా “ఆస్తి బాగుందా?”, “ధర ఎంత?”, “లోన్ వస్తుందా?” అని చూసుకోవడంతో పాటు.. “TAN తీసుకున్నానా?” అని కూడా చూసుకోవాల్సిన పరిస్థితి.
TAN కోసం దరఖాస్తు చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత టీడీఎస్ చెల్లింపు, ఫైలింగ్ వంటి ప్రక్రియలు పూర్తి చేయాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో ఆస్తి కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ ప్రక్రియను చివరి నిమిషానికి వదిలేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
అయితే అక్టోబర్ 1 నుంచి కథ మారుతుంది!
అవును 2026 అక్టోబర్ 1 నుంచి, నిర్దిష్ట పరిస్థితుల్లో NRI నుంచి స్థిరాస్తిని కొనుగోలు చేస్తున్న రెసిడెంట్ వ్యక్తి లేదా HUF ప్రత్యేకంగా TAN తీసుకోకుండానే తన PAN ఉపయోగించి TDS చెల్లించవచ్చు. అంటే ఇప్పటివరకు ఉన్న ఒక అదనపు మెట్టు తీసేసినట్టే.
సింపుల్‌గా చెప్పాలంటే..
సెప్టెంబర్ 30 వరకు — TAN అవసరం.
అక్టోబర్ 1 నుంచి — PANతో TDS చెల్లించే అవకాశం.
దీన్ని ఇలా అపార్థం చేసుకోవద్దు.
TAN అవసరం లేదంటే TDS కూడా లేదని కాదు. TDS కట్టాల్సిన బాధ్యత అలాగే ఉంటుంది. NRIకి చెల్లించాల్సిన మొత్తంలో వర్తించే టీడీఎస్‌ను మినహాయించి ప్రభుత్వానికి జమ చేయాలి. మారేది కేవలం దాన్ని చెల్లించే విధానంలో ఒక ముఖ్యమైన నిబంధన.
NRI అమ్మేవాడికి ఇబ్బందా?
సాధారణంగా ఈ TAN మార్పు వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనం కొనుగోలుదారుడికే. NRI ఆస్తిని అమ్ముతున్న వ్యక్తికి వర్తించే TDS నిబంధనలు అలాగే ఉంటాయి. కొనుగోలుదారుడే టీడీఎస్ మినహాయించి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
ఇంకో ఇంపార్టెంట్ విషయం..
ఎప్పుడూ కూడా ఇలాంటి డీల్స్ లో ఖచ్చితంగా చూసుకోవాల్సింది. NRI ఆస్తిని ఎప్పుడు కొన్నాడు? ఎప్పుడు అమ్ముతున్నాడు? అన్నది కూడా చాలా కీలకం. ఆస్తి రెండు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే అది సాధారణంగా దీర్ఘకాలిక మూలధన ఆస్తి కిందకు వస్తుంది. అలాంటి సందర్భంలో టీడీఎస్ రేటు సాధారణంగా 12.5 శాతం, దీనికి వర్తించే సర్‌చార్జ్, సెస్సు అదనం.
రెండు సంవత్సరాల లోపే అమ్మితే స్వల్పకాలిక మూలధన లాభాల నిబంధనలు వర్తిస్తాయి. అప్పుడు NRIకి వర్తించే పన్ను శ్లాబ్ ప్రకారం రేటు ఉండొచ్చు. అందుకే ఎప్పుడూ “ఆస్తి ధర ఇంత.. కాబట్టి TDS ఇంత” అని ఒకే లెక్కతో ముందుకెళ్లడం సరైంది కాదు.
ఫైనల్ గా…
మీరు ఇప్పటికే ఒక NRIతో ఆస్తి కొనుగోలు డీల్ మాట్లాడుకుంటున్నట్లయితే, రిజిస్ట్రేషన్ తేదీని ఒకసారి చూడండి. 2026 సెప్టెంబర్ 30లోపు లావాదేవీ జరిగితే ప్రస్తుత TAN నిబంధనలు వర్తిస్తాయి. అక్టోబర్ 1 తర్వాత జరిగితే కొత్త విధానం ప్రకారం PAN ఉపయోగించి TDS చెల్లించే అవకాశం ఉంటుంది.
అయితే డీల్ తేదీని కేవలం TAN కోసం మార్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆస్తి రిజిస్ట్రేషన్, చెల్లింపులు, ఒప్పందంలోని షరతులు, TDS మొత్తం.. అన్నీ కలిసి చూడాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీ అయితే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లేదా టాక్స్ సలహాదారుడు లేదా నిపుణుడితో ముందుగానే మాట్లాడటం మంచిది.








