టాలీవుడ్లో తాప్సీ రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా?
తెలుగు చిత్ర పరిశ్రమలో కెరీర్‌ను ప్రారంభించి, అనంతరం బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను(Taapsee Pannu) మరోసారి టాలీవుడ్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాలతో పాటు కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె, గత కొంతకాలంగా వెబ్ సిరీస్‌లపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆసక్తికరమైన కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
డైరెక్టర్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) తెరకెక్కించబోయే కొత్త హారర్ ప్రాజెక్ట్ కోసం తాప్సీని సంప్రదించినట్లు సమాచారం. విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమె అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉండటంతో తాప్సీ ఒప్పుకుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కథ, పాత్రతో పాటు ఇతర అంశాలపై డిస్కషన్స్ పూర్తయిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే యూవీ క్రియేషన్స్(UV creations) నిర్మాణ బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యంగా హారర్ జానర్లో మేర్లపాక గాంధీ చెప్పబోయే కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాప్సీ వెబ్ కంటెంట్‌లో బిజీగా ఉన్నప్పటికీ, సరైన కథ దొరికితే సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీ నిజమవుతుందా? అనే చర్చకు ఈ ప్రాజెక్ట్ మరింత ఆసక్తిని పెంచుతోంది.








