క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహం..!
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగాన్ని బలోపేతం చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు ముందుకు వేసింది. అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన 264 మంది క్రీడాకారులకు రూ.8.8 కోట్ల భారీ క్రీడా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకుని, వారిని అన్ని విధాలా ప్రోత్సహించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా శాప్ (SAP) చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, మట్టిలో దాగిన అసాధారణ ప్రతిభను వెలికితీసి, వారికి సరైన వేదికలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున రాణించేలా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. భవిష్యత్ ప్రణాళికలపై రవి నాయుడు మాట్లాడుతూ… 2036 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఆ ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశం తరఫున బరిలోకి దిగే మొత్తం క్రీడాకారులలో కనీసం 10 శాతం మంది తెలుగువారే ఉండేలా ఇప్పటి నుంచే క్రీడాకారులను ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే రాష్ట్రంలో అమరావతి ఛాంపియన్‌షిప్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించామని శాప్ చైర్మన్ గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క క్రీడాకారుడు ఆటకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, భవిష్యత్‌లోనూ క్రీడాకారుల ఎదుగుదలకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.








