ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల(Local Elections) ఎన్నికల వేడి అప్పుడే మొదలైన తరుణంలో, సామాజిక మాధ్యమాల్లో ఒక నకిలీ ఎన్నికల షెడ్యూల్ తీవ్ర కలకలం రేపింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తేదీలంటూ ఒక ప్రకటన విపరీతంగా వైరల్ కావడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత వేగంగా స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ షెడ్యూల్ పూర్తిగా ఫేక్ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరును, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్ఈసీ అధికారిక లోగోను వాడుకుంటూ ఒక తప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ను సృష్టించారు. దానిని నిజమైన ప్రెస్ నోట్ లాగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియా గ్రూపుల్లో వదిలారు. దీనిపై ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన సంస్థ లోగోను ఇలా దుర్వినియోగం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మైండ్ గేమ్‌లు ఆడటానికి, ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇదొక ప్లాన్ లాగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ పునేఠా మాట్లాడుతూ.. ఇటువంటి అసత్య ప్రచారాలను, నకిలీ షెడ్యూళ్లను ప్రజలు ఎవరూ నమ్మవద్దని మరియు వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తప్పుడు సమాచారాన్ని సృష్టించే వారిపై, అలాగే దాన్ని నిజమని నమ్మి గ్రూపుల్లో షేర్ చేసే వారిపై కూడా సైబర్ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని, పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమిషన్ అన్ని కోణాల్లో సమీక్షలు జరుపుతోందని, షెడ్యూల్ ఖరారైనప్పుడు తామే స్వయంగా అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. అప్పటివరకు కేవలం ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా అధికారిక పత్రికా ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వచ్చే నకిలీ ఫార్వార్డ్ మెసేజ్‌లను చూసి ఎవరూ మోసపోవద్దని స్పష్టం చేసారు.








