పులివెందులకు పవన్ బిగ్ గిఫ్ట్..!
ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం, దాని పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత విముక్తి లభించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీసుకున్న ప్రత్యేక చొరవతో.. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల తాగునీటి పథకానికి ఊహించని రీతిలో పునరుజ్జీవం లభించింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రతిష్టాత్మక ‘మెగా వాటర్ గ్రిడ్’ పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించారు.
నిధుల కొరత, పర్యవేక్షణ లోపంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ‘జల్ జీవన్ మిషన్’ (JJM) మరియు ‘అమరజీవి జలధార’ పథకాల కింద సుమారు రూ. 280 కోట్ల భారీ నిధులను కేటాయించి పనులకు కొత్త ఊపు తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు, పర్యవేక్షణ ఫలితంగా ఈ మెగా వాటర్ ప్రాజెక్టు పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తి కాగా, గ్రామాలకు నీటిని చేర్చే ప్రధాన పైప్లైన్ నిర్మాణం రికార్డు స్థాయిలో 99 శాతం పూర్తయింది.
విశేషమేమిటంటే.. పులివెందుల పట్టణ పరిధి, పులివెందుల గ్రామీణ ప్రాంతం మరియు సింహాద్రిపురం మండలాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు 100 శాతం విజయవంతంగా పూర్తయ్యాయి. వీటితో పాటు లింగాల మండల పరిధిలోని మరో 24 మారుమూల ఆవాసాలకు కూడా తాగునీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. సొంత నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులను గత పాలకులు పట్టించుకోకపోయినా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే పవన్ కళ్యాణ్ రూ. 280 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయడం పట్ల పులివెందుల నియోజకవర్గ ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఈ పనులను కేవలం కొన్ని నెలల్లోనే ముగించి ఇంటింటికీ రక్షిత తాగునీరు అందిస్తుండటంతో పవన్ కళ్యాణ్ మార్క్ పాలనపై ప్రశంసలు కురుస్తున్నాయి.








