నిమ్మ తొక్కలతో నేచురల్ విటమిన్ సి సీరమ్.. ఇంట్లోనే తయారు చేసుకోండి..
ముఖం సహజంగా కాంతివంతంగా కనిపించాలంటే ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో నిమ్మకాయ తొక్కలు కూడా ఒకటి. సాధారణంగా నిమ్మరసం ఉపయోగించిన తర్వాత తొక్కలను పడేస్తుంటారు. కానీ వాటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉండటంతో చర్మ సంరక్షణలో ఇవి ఉపయోగపడతాయి. వీటితో ఇంట్లోనే సహజసిద్ధమైన విటమిన్ సి సీరమ్ తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.

ఈ సీరమ్ తయారు చేయడానికి ఒక స్పూన్ ఎండబెట్టి పొడి చేసిన నిమ్మకాయ తొక్కలు, రెండు స్పూన్ల రోజ్ వాటర్, ఒక స్పూన్ అలోవెరా జెల్, నాలుగు నుంచి ఐదు చుక్కల గ్లిజరిన్, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ అవసరం. ముందుగా శుభ్రమైన గిన్నెలో నిమ్మ తొక్కల పొడి, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పది నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత పలుచటి వస్త్రం లేదా వడగట్టే గుడ్డతో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి.

తర్వాత ఈ రసంలో అలోవెరా జెల్, గ్లిజరిన్, విటమిన్ ఇ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. మిశ్రమం సీరమ్‌లా మెత్తగా మారిన తర్వాత డ్రాపర్ ఉన్న డార్క్ కలర్ గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.
ఈ సీరమ్‌ను రాత్రి నిద్రకు ముందు ఉపయోగిస్తే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ముందుగా ముఖాన్ని మృదువైన ఫేస్‌వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత రెండు లేదా మూడు చుక్కల సీరమ్‌ను ముఖం, మెడపై వేసి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ పగటి సమయంలో ఉపయోగించాలనుకుంటే కొన్ని నిమిషాల తర్వాత మాయిశ్చరైజర్‌తో పాటు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ రాయాలి. లేకపోతే ఎండ ప్రభావం వల్ల చర్మం జీడుగా మరే అవకాశం ఉంటుంది.
నిమ్మకాయ తొక్కల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా కనిపించేందుకు తోడ్పడుతుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ఉండే మురికి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. అలోవెరా జెల్ చర్మానికి తేమను అందిస్తే, గ్లిజరిన్ పొడిబారకుండా కాపాడుతుంది. విటమిన్ ఇ ఆయిల్ చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.

అయితే ఈ సీరమ్‌ను ఉపయోగించే ముందు ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. చేతి లోపలి భాగంలో కొద్దిగా రాసి కొన్ని గంటలు గమనించాలి. మంట, దురద, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తే ముఖానికి ఉపయోగించకూడదు. అలాగే ఈ సీరమ్‌ను ఫ్రిజ్‌లో ఉంచినా ఏడు నుంచి పది రోజులలోపు మాత్రమే వాడాలి. సీరం కలర్ లేదా స్మెల్ మారినట్లు అనిపిస్తే వాడకూడదు. సున్నితమైన చర్మం ఉన్నవారు లేదా ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతున్నవారు దీన్ని ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకుంటే మరింత సురక్షితం.








