కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు
కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ నియోజకవర్గానికి ( Banswada constituency) చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారని, చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్నివర్గాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆరఎస్లోనే ఉంటానని చెప్పిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) మాటతప్పారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారంతోపాటు కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకు యూరియా అందించలేకపోతున్నారు. కేసీఆర్ (KCR) హయాంలో రైతులకు అన్నీ ఇళ్ల వద్దకే వచ్చేవి. రూ.2 లక్షల రూణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. 30-40 శాతమైనా పూర్తిచేశారా? ఒక్క ఊరిలో అయినా వందశాతం రుణమాఫీ చేసినట్లు నిరూపించాలని సీఎం రేవంత్‌కు అసెంబ్లీలోనే సవాల్ విసిరా. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతుబంధు వేశారు. కాళేశ్వరంపై మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రజలు తెలిసిపోతుందనే రేవంత్ నీళ్లు వదలడం లేదు. మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు ఎందుకు చేయలేదు? ఎల్‌నినో వస్తుందని ఆరు నెలల ముందే శాస్త్రవేత్తలు చెబితే, ప్రభుత్వం ఇప్పుడు సమీక్షలు చేస్తోంది. సరైన ప్రణాళిక లేకుండా సీఎం పనిచేస్తున్నారు అని విమర్శించారు








