ఆ అవసరం నాకు లేదు : మీనాక్షీ నటరాజన్
కాంగ్రెస్ పార్టీలో తనపై కుట్ర చేసే అవసరం ఎవరికీ లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan) స్పష్టం చేశారు. గాంధీభవన్లో మీనాక్షీ నటరాజన్ మీడియాతో మాట్లాడుతూ అది బీజేపీ (BJP) పుట్టించిన వదంతి అని కొట్టి పారేశారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా తన నామినేషన్ తిరస్కరణకు ఒక రోజు ముందు ఆ పార్టీ ఈ పుకారు పుట్టించిందన్నారు. తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపేందుకు ఒక రాజ్యసభ సభ్యునిచేత రాజీనామా చేయిస్తున్నారన్న వార్త కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. ఒకరి చేత రాజీనామా చేయించి ఆ రాజ్యసభ సీటును తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన రాజకీయం మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోనే ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు. తమకు ప్రతి సీటూ, ప్రతి సభ్యుడూ ముఖ్యమేనన్నారు. దేశం కోసం అవసరమైనప్పుడు మాత్రమే అలా చేయిస్తారని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ జాతీయ నేత అభిషేక్ మను సింఘ్వి విషయంలో అవసరం కాబట్టే చేయించామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానానికి అవసరమైన 58 మంది సభ్యుల బలం ఉన్నందునే కాంగ్రెస్ అధిష్ఠానం తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని గుర్తుచేశారు.








