భారత రాజకీయాల్లో ఆయన హిమాలయాల్లాంటి నాయకుడు : బాబా రాందేవ్
ఆంధ్రప్రదేశ్లో విశిష్ట సంస్కృతి, ఆధ్యాత్మికత ఉన్నాయని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) అన్నారు. ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day)లో పాల్గొనేందుకు బాబా రాందేవ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంపై తనకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. దేశ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశిష్ట నాయకుడని కొనియాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు రావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి. యోగా సాధనతో ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. సీఎం చంద్రబాబు నిజాయతీ, కృషి, దూరదృష్టి దేశానికి ఆదర్శం. భారత రాజకీయాల్లో ఆయన హిమాలయాల్లాంటి నాయకుడు అని బాబా రాందేవ్ కొనియాడారు.








