తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు .. గొప్ప వరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడు బుల్లెట్ రైళ్ల (Bullet trains) ప్రాజెక్టుల్లో, ఏకంగా మూడింటిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం గొప్ప వరమని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి (G. Kishan Reddy) స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో కేంద్ర రోడ్డు, మౌలిక వసతుల నిధి (సిఆర్ఐఎఫ్) నుంచి కేటాయించిన రూ.87 కోట్ల నిధులతో చేపట్టే పలు కీలక రహదారి పనులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat Reddy)తో కలిసి ఉమ్మడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానికి కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి పుణె, బెంగళూరు, చెన్నైల మార్గాల్లో బుల్లెట్ రైళ్ల లైన్ల నిర్మాణానికే రూ.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుంటానని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర ప్రగతి ప్రస్థానంలో రంగారెడ్డి జిల్లా ఒక గుండె లాంటిదని కొనియాడారు. రాజధానికి ఆనుకుని ఉండి, పారిశ్రామికంగా ఎంతో వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రహదారుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, భారీగా నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్ల భారీ బడ్జెట్తో ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధి పనులను, మరో రూ.7 వేల కోట్లతో పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల విస్తరణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు వివరించారు.








