పాస్పోర్టు సేవల్లో తెలంగాణ పోలీస్ ఆదర్శం
పాస్పోర్ట్ (Passport) ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తున్నందుకు తెలంగాణ పోలీసులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ను ప్రదానం చేసింది. ఢిల్లీ లోని సుష్మా స్వరాజ్ భవన్లో నిర్వహించిన పాస్పోర్ట్ సేవ దివస్ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) చేతుల మీదుగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ అత్యంత కీలకమైనదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకుంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. పోలీసు సిబ్బంది నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (Cyberabad Police Commissioner)గా ఉన్న కాలంలో (2013-16) పాస్పోర్ట్ ధ్రువీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి వెరిఫాస్ట్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. దీనిని 2015 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. నాటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ పోలీసులకు ఈ విభాగంలో లభించిన 7వ జాతీయ అవార్డు కావడం గమనార్హం.








