విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు (No Admission Board) పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలోనూ ఊహించి ఉండరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ (Arutla Public School) ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా వెల్కమ్ కిట్స్ పంపిణీ, డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)తో పాటు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు, భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు, విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే వాటి ఛార్జీలు పెంచాం. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యాశాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది అని అన్నారు. ఉద్యోగులకు జీతాల మాదిరిగానే ప్రతినెలా ఒకటో తేదీన విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తాం అని ఆన్నారు.








