ఐటిసి చైర్మన్ సంజీవ్ పూరితో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టండి
కోల్ కత్తా : ఐటిసి చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ సంజీవ్ పూరితో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని, ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని, వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలిగే వంగడాల సృష్టి, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణంలో ఏపీతో కలసి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఐటిసి చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ… ఐటిసి సంస్థ ఇప్పటికే ఏపీలో స్పైసెస్ ప్రాసెసింగ్, గ్రీన్ లీఫ్ టుబాకో ప్రాసెసింగ్ ప్లాంట్లు (గుంటూరు), అగ్రి బిజినెస్ సెంటర్లు, నోట్ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ (గొల్లపూడి), ఐటి సొల్యూషన్స్, స్టార్ హోటల్స్ నిర్వహిస్తోందని తెలిపారు. సిఎస్ఆర్ నిధులతో సుస్థిర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం ద్వారా 361 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దఎత్తున ఆర్ ఓ వాటర్ ప్లాంట్లను నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని సంజీవ్ పూరి చెప్పారు.








