ఏపీలో ఈవి గ్రేడ్ అల్యూమినియం తయారీ యూనిట్ నెలకొల్పండి : మంత్రి నారా లోకేష్
ఇంటిగ్రేటెడ్ స్టీల్, డక్టైల్ ఐరన్ (DI) పైపుల తయారీ ప్లాంట్ పెట్టండి
శ్యామ్ మెటాలిక్స్, స్పెల్టర్స్ లిమిటెడ్, రష్మీ మెటాలిక్స్ ప్రతినిధుల భేటీలో లోకేష్ ప్రతిపాదన
కోల్ కత్తా : శ్యామ్ మెటాలిక్స్ & ఎనర్జీ లిమిటెడ్ డైరక్టర్ షీతల్ అగర్వాల్, సూపర్ స్పెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ చరణ్, రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజీవ్ కెఆర్. పట్వారీలతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ఏపీలో కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలతోపాటు శ్రీ సిటీ, కృష్ణపట్నం నోడ్ వంటి పారిశ్రామిక కారిడార్లలో ల్యాండ్, లాజిస్టిక్స్ పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఎగుమతి ఆధారిత అల్యూమినియం ఉత్పత్తుల తయారీకి ఏపీలో మంచి అవకాశాలున్నాయని, అల్యూమినియం ఫాయిల్, ఫ్లాట్-రోల్డ్ ఉత్పత్తులు, ఈవీ-గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా శ్యామ్ మెటాలిక్స్ డైరక్టర్ షీతల్ ను కోరారు.
రాజధాని అమరావతి నిర్మాణ కార్యకలాపాలు, ప్రధాన ఓడరేవుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలో అభివృద్ధి పనులు (విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్) చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో టిఎమ్‌టి బార్లు, స్ట్రక్చరల్ స్టీల్, నిర్మాణ సామగ్రికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకొని విజయనగరం ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 2 ఎంటిపిఎ కు విస్తరించాల్సిందిగా సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాల్ కృష్ణ చరణ్ కు మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. విజయనగరం పారిశ్రామిక కారిడార్లు, వాటి చుట్టుపక్కల టీఎంటీ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, స్టీల్ సర్వీస్ సెంటర్లు, పైపు/అనుబంధ తయారీ క్లస్టర్లతో సహా, ఆంధ్రప్రదేశ్‌లో డౌన్‌స్ట్రీమ్ స్టీల్, ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు రంగ కార్మికుల ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు.
రష్మీ మెటాలిక్స్ లిమిటెడ్ డైరక్టర్ సంజయ్ కెఆర్ పట్వారీతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్, డక్టైల్ ఐరన్ (DI) పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC) కు సమీప ప్రాంతంలో రష్మీ మెటాలిక్స్ పరిశ్రమను ఏర్పాటుచేస్తే అతిపెద్ద సమీకృత ఉక్కు పర్యావరణ వ్యవస్థ ఏర్పాటవుతుందని, దీనిద్వారా రష్మీ మెటాలిక్స్ ఎగుమతి కార్యకలాపాలు సులభతరమవుతాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.








