జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో బంగారం వెలికితీతతో సీమకు పునర్ వైభవం రానుందని అన్నారు. బుధవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో పర్యటించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బంగారం శుద్ధి కోసం బంగారు ఖనిజంతో కూడిన మట్టిన తీసుకెళ్లే భారీ వాహానాలను జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సీఎం సందర్శించారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు బంగారాన్ని మైనింగ్ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించనున్నారు.
జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో తొలి ఏడాది 400 కేజీలతో మైనింగ్ ప్రారంభించి తదుపరి దశలో 900 కేజీలు, అనంతరం 2 టన్నుల వరకూ బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. జియో మైసూర్ – డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు జొన్నగిరిలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజం నుంచి బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఉత్పత్తి యూనిట్‌లోని వేర్వేరు విభాగాలను పరిశీలించారు. బంగారు బిస్కట్లు సహా వివిధ రూపాల్లోని తుది ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకూ జరిగే ప్రక్రియలను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకరన్, ఎండీ నవీన్ లాల్ చంద్ర సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…”రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును లాంఛ్ చేయడం శుభపరిణామం. విస్తరణ యూనిట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న సువర్ణగిరే ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయి. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదే. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుంది. ఈ ప్రాంతానికి జొన్నగిరి బదులు స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందాం. 2047కు దేశాన్ని వికసిత్ భారత్ గా తయారు చేయాలన్నది ప్రధాని మోదీ కల. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆశయం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏపీ అంటే రత్నగర్భ
“ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఇక్కడి ప్రజల జీవితాలు స్వర్ణమయం కావాలి, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వర్ణగిరి మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. స్వర్ణగిరి గ్రామం నుంచే ఈ ప్రణాళిక ప్రారంభం అయ్యింది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుంది. దేశం ఇప్పుడు 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత ఇదే అతిపెద్ద దిగుమతి. బంగారం అంటే మనందరికీ ఎంతో మమకారం. బంగారం ఉంటే మనకు గౌరవంగా భావిస్తాం. తొలి ఏడాది 400 కిలోలు నుంచి ప్రారంభించి 50 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తికి చేరుకుంటాం. ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తంలో కొంత మేరైనా తగ్గుతుంది. దీంతో విదేశీ మారక నిల్వల్ని కొంత కాపాడుకోవచ్చు. స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది.
బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తాం. స్వర్ణగిరి నుంచి ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ ద్వారా బంగారం తరలించే ప్రాజెక్టు చేపడతాం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు…ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు… దొరకని ఖనిజాలు లేవు. మంగంపేట బెరైటీస్, కడప లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉంది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్. గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్. అనంతపురం, కడపలో ఐరన్ ఓర్…. కేజీ బేసిన్ లో గ్యాస్, పెట్రోల్ లభ్యమవుతాయి. ఈ వనరులను సద్వినియోగం చేసుకునేలా వాల్యూ ఎడిషన్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. సిమెంటు, స్టీల్ పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. ఈ గనులు, వచ్చే పరిశ్రమలతో ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ ఓ మోడల్. గత పాలకులు అక్రమ సంపాదన కోసం పరిశ్రమల్ని బయటకు తరిమేశారు. కేవలం ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్ తోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు.
సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నాం. స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకువస్తాం. అనంతపురంలో నాడు కియా తెచ్చాం. నేడు 5th జనరేషన్ ఫైటర్ జెట్ల ప్రాజెక్టు తెచ్చాం. 2028 ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ది చేస్తున్నాం. తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమ తీసుకువచ్చాం. నేను రాయలసీమ బిడ్డను. రాయలసీమను రతనాల సీమగా చేస్తాం. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి కొత్త చరిత్ర మొదలైంది… ఇక స్వర్ణ మయమే. అంతా కలిసి స్వర్ణాంధ్ర విజన్ 2047 కలను నిజం చేసుకుందాం.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.


సీమకు సాగునీరిచ్చాం
“రాయలసీమకు నీరిచ్చి ముఖ చిత్రాన్ని మార్చింది కూడా మా ప్రభుత్వమే. కేవలం రెండేళ్లలో సీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఏకంగా రూ.12,484 కోట్లు ఖర్చు చేశాం. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, HLC, LLC, KC CANAL, SRBC వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి సీమ గతిని మార్చాం. రాయలసీమను పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రణాళికలు రూపొందించాం. హంద్రీ నీవా కాలువల వెడల్పు పూర్తి చేసి రిజర్వాయర్లు, చెరువులు నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడుతున్నాం. టెంపుల్ టూరిజంతో పాటు… గండికోట వంటి ప్రాంతాలను ప్రసిద్ద పర్యాటక కేంద్రాలుగా చేస్తున్నాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర సాయంతో ఆక్సిజన్ ఇచ్చి… వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున డబ్బులు వేశాం. ప్రతీ నెలా మొదటి తారీఖున పేదలకు, వృద్ధులకు పెన్షన్ అందిస్తున్నాం. వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద పిల్లలందరికీ నిధులు జమ చేస్తాం. హామీ ఇవ్వక పోయినా 10,800 మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ స్కీంకు తీసుకువచ్చాం. ఈ నిర్ణయం వల్ల ఒక్కోక్కరికీ గరిష్టంగా రూ.3 కోట్ల వరకూ ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వానికి భారమైనా… ఉద్యోగులకు మేలు చేయాలనే భావనతో ఈ నిర్ణయాలు తీసుకున్నాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
మన బంగారం… మన వ్యాపారులకే
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జొన్నగిరిలో ఉత్పత్తి చేసిన బంగారంతో చేసిన ఏపీ మ్యాప్ ను జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి బహుకరించాయి. ఈ జ్ఞాపికను సీఎం చంద్రబాబు అందుకున్నారు. బంగారంతో తయారు చేసిన ఈ జ్ఞాపికను అమరావతిలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో ప్రతిష్టిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి ఉత్పత్తి అయిన బంగారాన్ని రాష్ట్రంలోని జ్వుయలరీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. ఏపీలో ఉత్పత్తి అయిన బంగారం రాష్ట్రంలోని వ్యాపారులకే విక్రయిస్తామని జియో మైసూర్ సంస్థ ప్రకటించింది. స్థానిక ఆర్ధిక వ్యవస్థకు ప్రయోజనం కలిగేలా ఇక్కడే విక్రయాలు చేస్తామని ఈ సంస్థ స్పష్టం చేసింది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో ఉత్పత్తి అయిన బంగారాన్ని వాసవీ జ్యూయలర్స్, సాయి సంతోష్ జ్యుయలర్స్, మధుమూర్తి జ్యుయలర్స్ , ఎమరాల్డ్ జ్యుయలర్స్ వంటి సంస్థలకు సీఎం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








