Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖరారైందా..?
మునుగోడు (Munugodu) కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) చాలాకాలంగా మంత్రి పదవికోసం గట్టిగా పైట్ చేస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆయన పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే వివిధ కారణాలతో ఆయనకు మంత్రి పదవి దక్కట్లేదు. అయితే ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్లకు ఇతర పదవులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి (Sudarshan Reddy) ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చింది. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు (Prem Sagar Rao) సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటుకోసం వీళ్లిద్దరూ గట్టిగై ఫైట్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్లద్దరికి కేబినెట్ ర్యాంకుతో పదవులు కట్టబెట్టడంతో వీళ్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మార్గం సుగమం చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, గడ్డం వివేక్ ఇప్పుడు రేవంత్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తొలివిడతలోనే చోటు దక్కింది. గడ్డం వివేక్ కు రెండో దశలో అవకాశం లభించింది. కానీ కోమటిరెడ్డికి మాత్రం మొండిచేయే ఎదురైంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడు కోసం తాను ఎందాకైనా వెళ్తానని బాహాటంగానే ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అడపాదడపా నేరుగానే అసంతృప్తి తెలిపారు. హైకమాండ్ సుముఖంగా ఉన్నా కూడా రాష్ట్రంలో కొంతమంది తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అయితే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. అలాంటప్పుడు ఒకే జిల్లా నుంచి మరో రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం రాంగ్ సిగ్నల్ ఇస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భయపడుతోంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టింది. అంతేకాక సొంత సోదరుడు కేబినెట్ లో ఉండగా కుటుంబంలో మరో వ్యక్తి కూడా కేబినెట్ లో చోటు ఇవ్వడం సరికాదనే ఆలోచనలో ఉంది. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉందా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తనకు హైకమాండ్ హామీ ఇచ్చినప్పుడు ఆ విషయం తెలీదా అని నిలదీస్తున్నారు.
అయితే ఇప్పుడు మంత్రిపదవి ఆశిస్తున్న వాళ్ల సంఖ్య తగ్గడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మార్గం సుగమం అయిందనే టాక్ నడుస్తోంది. డిసెంబర్ లో మరో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొంతకాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టోన్ మారడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది.







