ఒవైసీకి ఒక న్యాయం .. ఇతరులకు మరో న్యాయమా? : బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. హైకోర్టు (High Court)నే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలుగా తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కోర్టులు, చట్టాల పట్ల ఎంఐఎంకు ఎలాంటి గౌరవం లేదని మండిపడ్డారు. ఫాతిమా విద్యా సంస్థలకు సంబంధించిన అంశంలో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకుండా జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. చెరువును ఆక్రమించి విద్యా సంస్థలను నిర్మించడం తప్పని పేర్కొన్నారు. గండిపేట (Gandipet) లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇతర విద్యా సంస్థలకు వరుసగా కూల్చివేత నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం, ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? అని నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమే అయితే ఫాతిమా విద్యా సంస్థలపై కూడా అదే విధమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.








