ఏపీకి మరో భారీ పరిశ్రమ, లోకేష్ టీం కీలక ఒప్పందం..!
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దక్షిణ కొరియా పర్యటనలో కీలక అడుగు వేశారు. ప్రపంచ ప్రసిద్ధ పాదరక్షల తయారీ సంస్థ ‘షూఆల్స్’ (Shoealls) ఛైర్మన్ లీ చియాంగ్-గెన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షల రంగానికి ఉన్న అనుకూల వాతావరణాన్ని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను లీ చియాంగ్‌కు లోకేష్ సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో రూ.300 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టబోయే పాదరక్షల తయారీ యూనిట్ (Footwear Manufacturing Unit) పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలోని దాదాపు 3,000 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం ఫ్యాక్టరీల ఏర్పాటుకే పరిమితం కాకుండా, ఏపీలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన ‘షూఆల్స్ ఆర్అండ్డీ (R&D) మరియు ఇన్నోవేషన్ సెంటర్’ను కూడా ఏర్పాటు చేయాలని సరికొత్త ప్రతిపాదనను లోకేష్ తెరపైకి తెచ్చారు.
రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం, కనెక్టివిటీ సౌకర్యాలను వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను షూఆల్స్ సంస్థకు సంబంధించిన ప్రధాన రిటైల్ మరియు డిస్ట్రిబ్యూషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ సూచించారు. దీనివల్ల ఇటు సంస్థకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద బూస్టింగ్ లభిస్తుందని వివరించారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలపై షూఆల్స్ ఛైర్మన్ లీ చియాంగ్-గెన్ అత్యంత సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తాము పరిశీలిస్తున్నామని, త్వరలోనే తుది నిర్ణయంతో ముందుకెళ్తామని ఆయన వెల్లడించారు.








