Asaduddin Owaisi: భారత్-పాక్ మధ్య ‘మధ్యవర్తిత్వం’ చేశామన్న చైనా.. భగ్గుమన్న ఓవైసీ
“ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య తాము మధ్యవర్తిత్వం వహించామంటూ చైనా మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. ఈ అంశంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శత్రు దేశానికి సహకరించే చైనా మధ్యవర్తిత్వం చేశామని చెప్పుకుంటుంటే, మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు.
ఓవైసీ మాట్లాడుతూ.. పాకిస్తాన్కు అవసరమైన ఆయుధాల్లో 81 శాతం చైనానే సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు ‘రియల్ టైమ్ ఇంటెలిజెన్స్’ (Real-time Intelligence) అందించింది కూడా చైనానే అని ఆరోపించారు. అటువంటి దేశం శాంతిదూతలా మధ్యవర్తిత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, భారత ప్రభుత్వం వెంటనే ఈ వ్యాఖ్యలను అధికారికంగా ఖండించాలని డిమాండ్ చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెట్టి చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరం లేదని ఆయన (Asaduddin Owaisi) తేల్చిచెప్పారు.
మరోవైపు, మధ్యప్రదేశ్లో కలుషిత నీరు తాగి పలువురు మరణించిన ఘటనపై కూడా ఓవైసీ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.






