OPERATION SINDUR: పాక్ అణుకేంద్రంపై భారత్ దాడి చేసిందా..?
ఆపరేషన్ సిందూర్ ను ఆపాలని పాక్ ఎందుకు వేడుకుంది. యుద్ధం చేస్తామంటూ , బెదిరింపులకు దిగిన పాక్ .. ఎందుకలా కాళ్ల బేరానికి వచ్చింది. అసలు ఆపరేషన్ సిందూర్ ను భారత్ ఎందుకాపింది. ట్రంప్ హెచ్చరికలతో భారత్ వెనక్కు తగ్గిందా..? పాక్ వేడుకోవడంతో వదిలేసిందా..? దీనిపై అంతర్జాతీయ రక్షణ నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ వెన్నువిరిగినందువల్లే, గత్యంతరం లేక పాక్ .. భారత్ ను ఆపరేషన్ ఆపాలని కోరిందని వారు చెబుతున్నారు.
పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్ అణు కేంద్రంపై భారత వాయుసేన రహస్యంగా దాడి చేసిందని, ఆ దెబ్బతోనే ఇస్లామాబాద్ కాల్పుల విరమణ కోసం బతిమలాడిందని ప్రముఖ రక్షణ రంగ నిపుణుడు టామ్ కూపర్(tom cooper) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ దాడితో ‘మేము ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి దాడినైనా చేయగలం.. ఇక ఆపండి’ అనే బలమైన సందేశాన్ని భారత్ పాకిస్థాన్‌కు పంపిందని కూపర్ పేర్కొన్నారు.
తన వాదనకు బలంగా కొన్ని ఆధారాలను కూడా కూపర్ ప్రస్తావించారు. పాక్ పౌరులు తీసిన వీడియోలలో మిసైళ్లు కొండల్లోకి దూసుకెళ్లడం, దట్టమైన పొగలు రావడం స్పష్టంగా కనిపించాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
భారత వాయుసేన మొదట రాఫెల్, సుఖోయ్-30 యుద్ధ విమానాలతో పాక్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసి, ఆ తర్వాత అణు నిల్వ కేంద్రాల ప్రవేశ ద్వారాలను లక్ష్యంగా చేసుకునిందని వివరించారు. పాకిస్థాన్‌లోని తన వ్యక్తిగత వర్గాలు కూడా ఈ దాడిని ధ్రువీకరించాయని ఆయన అన్నారు.
అయితే, ఈ వాదనలను భారత వాయుసేన (ఐఏఎఫ్) ఖండించింది. ఈ నెల ప్రారంభంలో వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ మాట్లాడుతూ.. భారత్ కేవలం ఉగ్రవాద, సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని స్పష్టం చేశారు. కిరానా హిల్స్‌పై దాడుల వీడియోలు పాకిస్థాన్ సృష్టించినవి కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు, అణు స్థావరాలపై జరిగిన దాడిని ఏ దేశమూ అధికారికంగా అంగీకరించదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉన్నందున, భారత్ ‘వ్యూహాత్మక మౌనం’ పాటిస్తోందని వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి













