Khamenei: యుద్ధనౌకల్ని ముంచేసే శక్తి మాకుంది.. ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు
పశ్చిమాసియా దిశగా అమెరికా యుద్ధనౌకలు ప్రయాణిస్తున్నాయి.. మరోవైపు 24 గంటల్లోనే 50కి పైగా ఫైటర్ జెట్లను అమెరికా మోహరించింది. అటు సముద్రంలో యుద్ధవాహక నౌకలు కదలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అమెరికాకు.. ఇరాన్ ఝలకిచ్చింది. సముద్రంలో ఉన్న అతిపెద్ద యుద్దవాహకనౌకలు ప్రమాదకరమే కానీ.. అవి సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ప్రపంచంలోనే బలమైన సైనికశక్తి ఉన్నవాళ్లకు ఎదురుదెబ్బలు తగిలే అవకాశముందని హెచ్చరించారు.
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించబోదన్నారు. ఇరాన్లో పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. జెనీవా వేదికగా ఇరాన్-అమెరికాల మధ్య పరోక్ష అణు చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

‘‘తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. అయితే, ఒక్కోసారి అది కోలుకోలేనంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇరాన్ దిశగా యుద్ధ నౌకలను పంపించామని ప్రకటనలు చేస్తున్నారు. ఆ నౌకలు నిజంగా ప్రమాదకరమైనవి. కానీ, వాటిని సముద్రంలో ముంచేసే సామర్థ్యమున్న ఆయుధం మరింత ప్రమాదకరం. 47 ఏళ్లుగా ఇస్లామిక్ రిపబ్లిక్‌ను ఏమీ చేయలేకపోయామని అమెరికా అంగీకరించడం శుభపరిణామం. ఎన్నటికీ ఏమీ చేయలేరు. అణు చర్చలు జరుపుదాం అంటున్నారు. కానీ, చివరకు మీ దగ్గర అణ్వాయుధాలు ఉండకూదని చెబుతున్నారు. చర్చల ఫలితాలను ముందుగానే నిర్ధరించడం తప్పిదం, మూర్ఖత్వమే’’ అని ఖమేనీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.
జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు మూడు గంటల్లో ముగిశాయి. చర్చల సమయంలోనే హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ సందర్భంగా జలసంధిని కొన్ని గంటల పాటు మూసివేసింది. ఈ క్రమంలో లైవ్ క్షిపణులను ప్రయోగించడం గమనార్హం. ఆ ప్రాంతంలో అమెరికా సైన్యాన్ని మోహరిస్తున్న వేళ టెహ్రాన్ ఈ చర్యలకు ఉపక్రమించింది.
ఇవి కూడా చదవండి













