పార్టీ పేరుపై కవిత తర్జనభర్జన!
భారత్ రాష్ట్ర సమితి నుండి బయటకు వచ్చి, తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని సృష్టించుకోవాలని భావించిన కల్వకుంట్ల కవితకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాత ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను, గులాబీ కేడర్‌ను ఆకట్టుకోవడానికి వీలుగా ఆమె ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) అనే పేరుతో సరికొత్త పార్టీని ప్రకటించారు. TRS అనే మూడు అక్షరాలతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనేది ఆమె ప్లాన్. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఈ పేరు రిజిస్ట్రేషన్‌కు రాగానే కథ అడ్డం తిరిగింది. ఈ పేరుపై బీఆర్ఎస్ శ్రేణుల నుండి, ఇతర వర్గాల నుండి రికార్డు స్థాయిలో భారీగా అభ్యంతరాలు రావడంతో ఈసీ దీనిని తిరస్కరించింది. రాబోయే 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితకు అల్టిమేటం జారీ చేసింది.
కవిత మాత్రం వెనక్కి తగ్గకుండా ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటిస్తున్నారు. అయితే, కవిత ఇలా పార్టీ పేరు చుట్టూ వివాదాలు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగితే అది క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక కొత్త పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించేటప్పుడు కేడర్‌లో, ఓటర్లలో స్పష్టత ఉండాలి. కానీ, ఇప్పటికే ఒకటికి రెండుసార్లు పార్టీ పేరు మార్పులు, లీగల్ నోటీసుల వ్యవహారాలతో ప్రజల్లోకి నెగెటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. చివరకు నెలల తరబడి కోర్టుల్లో పోరాడినా ఈసీ పరిధిలోని సాంకేతిక అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి.. చివరి నిమిషంలో పేరు మార్చుకోవాల్సి వస్తే పార్టీలో తీవ్ర కన్ఫ్యూజన్ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి కవిత బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి సొంతంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు.. ఆమె దశాబ్ద కాలంగా నడుపుతున్న ‘తెలంగాణ జాగృతి’ పేరునే పొలిటికల్ పార్టీగా మారుస్తారని రాజకీయ వర్గాలన్నీ బలంగా నమ్మాయి. కానీ ఆమె అనూహ్యంగా టీఆర్ఎస్ పేరును ఎంచుకుని చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ సమాజంలో కవిత పేరు వినబడగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ‘తెలంగాణ జాగృతి’ మాత్రమే. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ద్వారా, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడం ద్వారా కవిత మహిళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జాగృతి బ్రాండ్‌ను విపరీతంగా ప్రమోట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థకు ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ బలమైన నెట్వర్క్, నిబద్ధత కలిగిన కేడర్ ఉన్నారు. ‘తెలంగాణ రక్షణ సేన’ అనే ఒక కొత్త పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దానికి గుర్తింపు తేవడానికి పడే శ్రమ కంటే.. ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్ ఉన్న ‘తెలంగాణ జాగృతి’ లేదా ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని పార్టీగా మారిస్తే ప్రజల్లోకి దూసుకెళ్లడం అత్యంత సులువవుతుంది.
అందుకే ప్రస్తుతం కవిత చుట్టూ ఉన్న ముఖ్య అనుచరులు, రాజకీయ శ్రేయోభిలాషులు ఆమెకు ఒక కీలకమైన సలహా ఇస్తున్నారు. లేనిపోని ప్రతిష్టకు పోయి TRS అనే మూడు అక్షరాల కోసం ఈసీతో, కోర్టులతో కాలయాపన చేయడం కంటే.. ఈ గందరగోళానికి తక్షణమే తెరదించి ‘జాగృతి’నే అధికారిక రాజకీయ పార్టీ పేరుగా ప్రకటించుకోవాలని కోరుతున్నారు. చట్టపరమైన చిక్కుల్లో సమయాన్ని వృథా చేసుకోవడం కంటే, క్లీన్ రోడ్‌గా ఉన్న ‘తెలంగాణ జాగృతి’ అస్త్రాన్ని ప్రయోగించడమే కవిత పొలిటికల్ కెరీర్‌కు సేఫ్ అండ్ బెస్ట్ రూట్ అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 15 రోజుల అల్టిమేటం గడువులోగా కవిత పట్టుదలకు పోయి న్యాయపోరాటం వైపు అడుగులు వేస్తారా? లేక గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ‘జాగృతి’ రూట్‌ను ఎంచుకుంటారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








