టీడీపీలో భారీ మార్పులకు సిద్దం..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి పరిపాలనలో దూసుకుపోతున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పార్టీ అంతర్గత బలోపేతంపై అత్యంత కీలకమైన వ్యూహాత్మక కసరత్తును ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు ఒక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా చాలా మంది సీనియర్లను, యాక్టివ్గా లేని నాయకులను పక్కన పెట్టేసి, కొత్త ముఖాలకు, యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి సొంత ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కొన్ని సమీకరణాల వల్ల వెనుకబడిన ప్రాంతాలు లేదా ఇన్ఛార్జ్లు సరిగ్గా పని చేయని చోట్ల గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. కేవలం పేరుకే ఇన్ఛార్జ్లుగా ఉంటూ, క్యాడర్ను పట్టించుకోని వారిని మార్చేయాలని చంద్రబాబు గట్టిగా ఉన్నారట. అక్కడ సమర్థులైన, ప్రజల్లో నిరంతరం ఉండే కొత్త నాయకులను ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
ఇక ఈ సమీక్షల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైనా టీడీపీ అంతర్గతంగా సమీక్షలు నిర్వహిస్తోంది. కూటమి ధర్మం ప్రకారం ఆయా స్థానాలు మిత్రపక్షాలకే ఉన్నప్పటికీ, అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ చెల్లాచెదురు కాకుండా చూసుకోవడం, క్యాడర్ను యాక్టివ్గా ఉంచడం అత్యవసరం అని భావిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, మిత్రపక్షాల స్థానాల్లో కూడా టీడీపీ బలాన్ని తగ్గకుండా చూసుకునేందుకు అంతర్గత సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు, గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న ఆ 11 నియోజకవర్గాలపై టీడీపీ టాప్ ప్రయారిటీ పెట్టింది. ఆ 11 స్థానాల్లో వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. అక్కడ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ లోపాలు జరిగాయి? అనే విషయాలపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇన్ఛార్జ్ల పనితీరును బేరీజు వేస్తున్నారు. ఒకవేళ వారి వల్ల పార్టీ పుంజుకునే అవకాశం లేదని తేలితే, క్షణం కూడా ఆలోచించకుండా వారిని పక్కన పెట్టి.. ఆర్థికంగా, అంగబలం పరంగా, ప్రజల్లో క్రేజ్ ఉన్న సరికొత్త సమర్థ నాయకులను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈసారి సమీక్షల్లో కేవలం “పనితీరు” మాత్రమే ఏకైక ప్రామాణికం అని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎంతటి సీనియర్ నాయకుడైనా, గతంలో ఎంత పెద్ద పదవి అనుభవించినా సరే.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేకపోతే, సమన్వయ కమిటీలు సరిగ్గా నడపకపోతే వారిని తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా మంది పాత తరం నేతలను పక్కన పెట్టేసి, కొత్త వారికి, యువతకు ఛాన్స్ ఇవ్వాలనే గట్టి ఆలోచనలో అధిష్టానం ఉంది.








