ప్రజాప్రభుత్వంలో రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమల రాక :మంత్రి లోకేష్
కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ
రేపు ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్
అమరావతి: ప్రజా ప్రభుత్వ పాలనలో రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. పరిశ్రమల రాకతో ముఖ్యంగా రాయలసీమలోని కడప జిల్లా రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ లు క్యూ కట్టాయి. ఈ ఏడాది మే 22న జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలోనే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు బుధవారం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
రూ.3,100 కోట్ల పెట్టుబడి, 700 మందికి ఉద్యోగాల కల్పన
దాల్మియా సిమెంట్ పరిశ్రమ రూ.3,100 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టనుంది. మైలవరం మండలంలోని చిన్నకొమెర్లలో ప్లాంటులో దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్తప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ఇప్పటివరకు ఉన్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా 1,650 మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ పెట్టుబడుల వల్ల అనుబంధ పరిశ్రమల్లో కూడా అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
ప్రభుత్వానికి ఏటా రూ.325 కోట్ల ఆదాయం
ప్రస్తుతం సంస్థ పన్నులు, మైనింగ్ రాయల్టీల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.102 కోట్లు చెల్లిస్తోంది. ప్రతిపాదిత విస్తరణ పూర్తైన తర్వాత ఈ వార్షిక ఆదాయం రూ.325 కోట్లకు పెరుగుతుంది. దాల్మియా సంస్థ రెండో దశ విస్తరణ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. సిమెంట్ పరిశ్రమకు అవసరమైన 80శాతం విద్యుత్ ను పునరుత్పాదక విధానంలో తీసుకోనుంది. మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ, పరిశ్రమలో ఉపయోగించిన నీటిని పూర్తిగా పునర్వినియోగం చేసే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. సుమారు రూ.100కోట్ల పెట్టుబడితో 130 అధిక సామర్థ్య బ్యాగ్ ఫిల్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
దేశంలో నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ
దాల్మియా భారత్ గ్రూప్ ఎనిమిది దశాబ్దాలకు పైగా సిమెంట్, చక్కెర, విద్యుత్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ, 54.7 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం, రూ.14,800 కోట్ల వార్షిక టర్నోవర్ తో దేశంలో నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా నిలిచింది. సంస్థకు 12 రాష్ట్రాల్లో 19 సిమెంట్ కర్మాగారాలు, గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని 23 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ.. 33,000 మందికి పైగా డీలర్లు, సబ్-డీలర్ల నెట్వర్క్ ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది.








