మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల సమావేశం
ప్రజా రాజధాని అమరాతి (Amaravati) నిర్మాణానికి సింగపూర్ (Singapore) ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. అమరావతిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవాలను పంచుకోవటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల శిక్షణ, సలహాలు, సూచనలు అందిస్తామని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు హామీ ఇచ్చారు. రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ (AP CRDA) కార్యాలయంలో మంత్రి నారాయణతో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి నగర నిర్మాణంలో నాణ్యత, ప్రణాళిక, సాంకేతిక అంశాలకు సంబంధించి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో పరస్పర సహకారం, సాంకేతిక భాగస్వామ్యం, శిక్షణ, సలహాలు, సూచనలపై చర్చించారు.
ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టే లియాన్ చీ, డిప్యూటీ డైరెక్టర్ లిమ్ చి కియా నిషాషార్దా, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్, సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు పాల్గొన్నారు.








