FTCCI అధ్యక్షుడిగా కేకే మహేశ్వరి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ గరిమెళ్ల ఎన్నిక
దేశంలోని అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక వాణిజ్య, పారిశ్రామిక సంస్థలలో ఒకటైన 109 ఏళ్ల చరిత్ర కలిగిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) వార్షిక Jజనరల్ బాడీ సమావేశం బుధవారం రెడ్ హిల్స్‌లోని FTCCI కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కృష్ణ కుమార్ మహేశ్వరి (కేకే మహేశ్వరి) అధ్యక్షుడిగా, శ్రీనివాస్ గరిమెళ్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
కేకే మహేశ్వరి, గత అధ్యక్షుడు ఆర్. రవికుమార్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 2025-26 సంవత్సరంలో కేకే మహేశ్వరి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, శ్రీనివాస్ గరిమెళ్ల వైస్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.
ఈ ఇద్దరు నాయకులు FTCCIతో అనేక సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉండి, వివిధ హోదాల్లో సేవలందించారు. పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య ప్రోత్సాహం, విధాన పరిరక్షణ, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో విశేష కృషి చేశారు. వీరి పదవీకాలం ఒక సంవత్సరం.
నాలుగు దశాబ్దాలకు పైగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో విశేష అనుభవం కలిగిన కేకే మహేశ్వరి ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన విభిన్న ఆర్థిక సేవలను అందిస్తున్న సీఐఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థకు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సీఐఎల్ గ్రూప్‌కు చెందిన పలు సంస్థల బోర్డుల్లో సభ్యుడిగా ఉన్నారు.
సీఐఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీ. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సభ్యత్వాలను కలిగి ఉంది. రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, మర్చంట్ బ్యాంకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్ సేవలను కూడా అందిస్తోంది.
మహేశ్వరి అనేక జాతీయ స్థాయి పరిశ్రమ, ఆర్థిక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ANMI) సంస్థకు మాజీ అధ్యక్షుడు, డైరెక్టర్‌గా, అలాగే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడిగా సేవలందించారు.
అదేవిధంగా ఆయన తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా వెటరన్స్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత కలిగిన మహేశ్వరి, చున్నీలాల్ జాజూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందిస్తున్నారు. అలాగే గిరిజన బాలల విద్య కోసం పనిచేస్తున్న గిరిజన్ వికాస్ కేంద్ర, వేదురునగరం సంస్థకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
నూతన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల తయారీ, ఆటోమేషన్, లాజిస్టిక్స్, ఫుడ్ టెక్నాలజీ రంగాల్లో విస్తృత అనుభవం కలిగిన పారిశ్రామికవేత్త, వ్యూహాత్మక సలహాదారు.
ఆయన హెట్సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్ మరియు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా, అలాగే జపాన్‌కు చెందిన బహుళజాతి సంస్థ డైఫుకు భారత అనుబంధ సంస్థ డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఛైర్మన్‌గా ఉన్నారు.
గారిమెళ్ల సహ వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ ఆటోమేషన్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సంస్థలలో ఒకటిగా ఎదిగి, అనంతరం డైఫుకు సంస్థ చేత కొనుగోలు చేయబడింది.
గత పదేళ్లకు పైగా FTCCIలో మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా చురుకుగా పనిచేస్తూ MSMEల అభివృద్ధి, పారిశ్రామిక పోటీతత్వం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు.
అలాగే పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల అకాడమిక్ కౌన్సిళ్లలో సభ్యుడిగా సేవలందిస్తూ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టప్‌లకు, యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నారు.
ఎన్నిక అనంతరం FTCCI అధ్యక్షుడు కేకే మహేశ్వరి మాట్లాడుతూ, “తెలంగాణతో పాటు దేశ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిలో FTCCI శతాబ్దానికి పైగా కీలక పాత్ర పోషించింది. పరిశ్రమ-ప్రభుత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, MSMEలకు మద్దతు ఇవ్వడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, తెలంగాణ పరిశ్రమలను ప్రపంచ స్థాయిలో మరింత పోటీతత్వంతో నిలబెట్టడం నా ప్రధాన లక్ష్యాలు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి కోసం పరిశ్రమల గొంతుకగా FTCCI కొనసాగుతుంది” అని అన్నారు.
శ్రీనివాస్ గారిమెళ్ల మాట్లాడుతూ, “సాంకేతికత, పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలు, తయారీ రంగ వృద్ధి ఆధారంగా భారత్ వేగవంతమైన ఆర్థిక మార్పు దిశగా పయనిస్తోంది. అన్ని స్థాయిల వ్యాపార సంస్థలకు మద్దతు అందించడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలకు అవకాశాలు కల్పించడం FTCCI లక్ష్యం. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తాం” అని తెలిపారు.
నూతన నాయకత్వ బృందం FTCCIని మరింత బలోపేతం చేస్తూ, పరిశ్రమలు, ప్రభుత్వం, సమాజం మధ్య విశ్వసనీయ వారధిగా సంస్థ పాత్రను మరింత విస్తరించనుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








