బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వేలకోట్లు దోచుకున్నారు : మంత్రి లోకేశ్
ఓబులాపురంలో దోచుకున్న సొమ్ముతోనే సాక్షి పేపర్, టివి పెట్టారు
ఐదేళ్ల పాలనలో కడప జిల్లాకు జగన్ చేసింది శూన్యం
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
ఈనెల 24న తల్లికి వందనం నిధులను జమ చేయబోతున్నాం
ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్
ప్రొద్దుటూరు: జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు.. సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ, జగన్ అధికారంలో ఉండగా కడపజిల్లాకు ఒక్క పరిశ్రమను సీమకు తీసుకురాకపోగా, ఇక్కడ సంపదనంతా అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లిలో నియోజకవర్గ టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 11వేల ఎకరాలను రూ.18వేల చొప్పున, మరో 3వేల ఎకరాలను రూ.25వేల చొప్పున భూములు తీసుకున్నారు, యువతకు 10వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారు. ఓబులాపురం గనుల్లో విచ్చలవిడిగా ఐరన్ ఓర్ తవ్వేసి రెడ్ గోల్డ్ పేరుతో విదేశాలకు తరలించి వేలకోట్లు దోచుకున్నారు, అదే అవినీతి సొమ్ముతో సాక్షి పత్రిక,టివిలను కూడా పెట్టారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కడపకు జగన్ చేసింది శూన్యం, చివరకు ఆయన నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చింది కూడా చంద్రబాబేనని తెలిపారు. ఈరోజు దాల్మియా భారత్ విస్తరణ పనులకు మేం శంకుస్థాపన చేశాం, వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా లీగల్ నోటీసులు ఇచ్చి అడ్డుకోవడమేగాక మామూళ్ల కోసం వేధించారని అన్నారు.
వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫ్యాక్టరీలు తెస్తున్నాం
చంద్రబాబు నాయుడు నాలుగోసారి సిఎం అయ్యాక రాయలసీమలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతోంది. జెఎస్ డబ్ల్యు స్టీల్ ప్లాంట్ కు ఇటీవల భూమిపూజ చేశారు, అంతకుముందు ఎస్ఎఇఎల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించాం, జిల్లావ్యాప్తంగా స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పరిశ్రమలతోపాటు హార్టికల్చర్ ను కూడా ప్రోత్సహిస్తున్నాం. గొడ్డలి పార్టీ ఫ్యాక్షనిజం తెస్తే మేం ఫ్యాక్టరీలు తెచ్చాం, రాయలసీమలో వారు రక్తాన్ని పారిస్తే, మేం ఉద్యోగాల పంట పండిస్తున్నాం. వారు అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడును ఇంటినుంచి బయటకు రానీయకుండా గేట్లకు తాళాలు వేయించారు, ఈరోజు జగన్ స్వేచ్ఛగా ఎక్కడకు వెళ్లడానికైనా అనుమతి ఇస్తున్నాం. ఇదే ప్రొద్దుటూరులో బిసి నేత నందం సుబ్బయ్యను వైసిపి హయాంలో దారుణంగా హతమార్చారు, మేం వారి కుటుంబానికి అండగా నిలిచి, వారి బిడ్డలను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూలులో చదివిస్తున్నామని చెప్పారు.
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలే. ఎంతచేసినా వారి రుణం తీర్చుకోలేం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నాపై కోడిగుడ్లతో దాడిచేసి, భయపెట్టాలని చూశారు, జి.ఓ. నెం.1 పేరుతో పాదయాత్రను అడ్డుకోవాలని విఫలయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట కడప జిల్లా. మధ్యలో రెండు ఎన్నికల్లో ఇబ్బందిపడినా గత ఎన్నికల్లో మళ్లీ పార్టీకి గతవైభవం తెచ్చారు. అధికారంలోకి వచ్చామని కష్టకాలాన్ని మర్చిపోకూడదు. నేను పాదయాత్ర బుక్ చూసినపుడు ఆనాటి స్మృతులన్నీ గుర్తుకువస్తుంటాయి. మినీ ముంబాయిగా పేరొందిన ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవల జొన్నగిరి గోల్డ్ మైన్ ను ప్రారంభించిన చంద్రబాబు గారు రాయలసీమను గోల్డ్ హబ్ గా మార్చేందుకు కృషిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ప్రొద్దుటూరులో నాలుగుసార్లు టిడిపి గెలిచింది.
ఇవి కూడా చదవండి
కోటిమంది కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు సహజం
2025 కడపలో జరిగిన మహానాడులో ఆరుశాసనాలను తీసుకున్నాం. అందులో ముఖ్యమైంది కార్యకర్తే అధినేత. దానిని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. కోటిమందికి పైగా కార్యకర్తలున్న అతిపెద్ద కుటుంబం మనది. ఇంత భారీ వ్యవస్థలో చిన్నచిన్న సమస్యలు సహజం. బూత్, క్లస్టర్, మండల, నియోజకవర్గ, పార్లమెంటు, జోనల్ స్థాయిల్లో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ దశల్లో పరిష్కారం కాకపోతే కేంద్ర కార్యాలయం దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. కార్యకర్తల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నాయకులందరిపైనా ఉంది. పార్టీలో సంస్కరణల కోసం నేను ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. సమస్యలను నాలుగుగోడల నడుమ బాబుగారితో చర్చిస్తాం. బయటకు వచ్చాక జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ముక్తకంఠంతో నినదించాలి.
క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత నాది
సీనియర్ నేత, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ప్రతిపక్షంలో ఈ నియోజకవర్గంలో అనేకమంది నేతలు నాతో కలసి నడిచారు. వారందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంది. పార్టీలో వర్గాలు ఉండకూడదు. వర్గాల వల్ల పార్టీ నష్టపోతుంది. నాయకులు పార్టీని నమ్మి పనిచేయండి, వారికి సరైన స్థానం కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. కష్టపడిన నాయకులను గుర్తించేందుకే మై టిడిపి యాప్ తెచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పనిచేసే 4లక్షలమంది నాయకుల పనితీరును అంచనా వేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా మై టిడిపి యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురండి. పదవులు వాటంతట అవే మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. నామినేటెడ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియను చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలివిడతలో అవకాశం రానివారికి మలివిడతలో వస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించే బాధ్యత నాది.
ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాల అమలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు నడిపిస్తున్నాం. ఈనెల 24వతేదీన రెండోవిడత తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నాం. దేశంలో మరెక్కడా లేనివిధంగా రూ.4వేల పెన్షన్ అందజేస్తున్నాం. దీపం-2 పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలండర్లు, స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు, చేనేతలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం. ఎన్నికల్లో హామీ ఇవ్వని అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేశాం. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు 16వేల టీచర్ పోస్టులు, 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేశాం. 10వేల పోస్టులతో జాబ్ క్యాలండర్ ప్రకటించాం. ఒకవైపు గతంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మరోవైపు సంక్షేమాన్ని పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నాం. వైసిపి హయాంలో ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వంలో ట్రూడౌన్ చేసి తగ్గించాం, చెత్తపై పన్ను వంటి వాటిని తొలగించాం. 60వేలకోట్ల లోటు బడ్జెట్ ఉన్నా సంక్షేమ పథకాలను సంతృప్తస్థాయిలో అందజేస్తున్నాం. మరో ఏడాది కష్టపడితే ఆర్థిక సమస్యలను అధిగమిస్తాం. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజాప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం నింపాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉంది.
రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు పార్టీల కలయిక
కేవలం రాష్ట్రాభివృద్ధే ఏకైక ఎజెండాగా టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడ్డాయి. ఒకరి పేరుతో మరొకరిని ఉసిగొల్పేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి రెచ్చగొట్టేందుకు వైసిపి పేటిఎం బ్యాచ్ ప్రయత్నిస్తారు. కూటమి కేడర్ అప్రమత్తంగా, ఐక్యంగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలి. ఎట్టి పరిస్థితులు ఎదురైనా దీర్ఘకాలం కూటమి కొనసాగుతుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని మోడీజీ అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారు. విశాఖ స్టీల్ కు నిధులు, రైల్వే జోన్, బిపిసిఎల్ వంటి భారీ ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇచ్చారు. కేంద్రం సహకారంతోనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం. సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోడీ. ఆయన నేతృత్వంలో కలసికట్టుగా ముందుకు సాగుతాం. కార్యకర్తలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో మాదిరిగానే పనిచేయండి. రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్, ప్రతి ఓటు మనకు కీలకమే. భారీ మెజారిటీతో నెగ్గిన మంగళగిరిలో కూడా 20 బూత్ లలో మైనస్ వచ్చింది. ప్రజలతో బంధాన్ని ఏర్పాటుచేసుకొని మమేకమై ముందుకు సాగాలని యువనేత లోకేష్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు.








