ఇప్పుడు ఇలా… టమాటా–మునగాకు రోటి పచ్చడి చేసేవాళ్ళు లేరేమో!
మునగాకు (Drumstick Leaves), టమాటా (Tomato) కలిపి చేసే ఈ రోటి పచ్చడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. మునగాకు స్వల్ప చేదుకు టమాటా పులుపు, ఎండుమిరపకాయల కారం చక్కగా కలుస్తాయి. సరియైన మోతాదులో కరెక్ట్ పద్ధతిలో చేస్తే ఈ పచ్చడి సుమారు నెలపాటు నిల్వ కూడా చేసుకోవచ్చు.
మునగాకు, టమాటా మిశ్రమాన్ని సిద్ధం చేసే విధానం

ముందుగా రెండు కప్పుల మునగాకులను తీసుకుని కాడల నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. నీరు పూర్తిగా పోయే వరకు ఆరబెట్టాలి. బాణలిలో తక్కువ మంటపై ఆకుల్లోని తేమ పూర్తిగా పోయి, ఆకులు కాస్త క్రిస్పీగా మారే వరకు వేయించాలి. మునగాకు మోస్తారు వేగిన తర్వాత ఒక స్పూన్ పల్లీలనున్న జత చేయాలి. మునగాకును ఇలా ప్రత్యేకంగా వేయించడం వల్ల పచ్చడిలో దాని రుచి చక్కగా తెలుస్తుంది.
ఇప్పుడు నాలుగు మధ్యస్థ టమాటాలను ముక్కలుగా కోసి బాణలిలో వేయాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి, వాటిలోని నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు వేయించాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఈ దశలో తేమ మిగలకుండా చూడాలి. చివర్లో చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు, తగినంత ఉప్పు, కారం ఆవపిండి మెంతి పిండి వేసి బాగా కలపాలి. ఈ దశలో మునగాకును వేసి కలుపుకోవాలి.
పచ్చడికి తాలింపు, నిల్వ చేసే విధానం

చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి బాగా రుబ్బుకోవచ్చు. కాస్త కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ పచ్చడి మజా ఉంటుంది. చివరగా బాణలిలో 3–4 టేబుల్స్పూన్ల పల్లీల నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. వెల్లుల్లి బాగా ఇష్టపడేవారు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను తిరగమాతలో వేసుకోవచ్చు.అందులో పచ్చడిని వేసి తక్కువ మంటపై కొన్ని నిమిషాలు కలుపుతూ వేయించాలి. పచ్చడిలో తేమ పూర్తిగా పోయి నూనె పైకి కనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు సీసాలో నింపాలి. ఎప్పుడూ పొడి చెంచాతోనే తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే ఫ్రిజ్లో ఉంచడం మంచిది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలిపి తింటే రుచి అదిరిపోతుంది.








