దమ్ముంటే జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేష్ సవాల్..!
డీఎస్సీ-2025 (DSC-2025) నియామకాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. ఏడాది కాలం అంతా సజావుగా సాగి, పక్కాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత.. ఇప్పుడు వైకాపా నేతలు కావాలనే కోర్టుల్లో కేసులు వేస్తూ, అక్రమాలు జరిగాయంటూ బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కొందరికి కనీసం ‘డీఎస్సీ’ అంటే అర్థం కూడా తెలియదని, అలాంటి వాళ్లు పేపర్ లీక్ అంటూ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎన్‌క్రిప్ట్ చేయలేని అత్యాధునిక ఆన్లైన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని లోకేష్ వెల్లడించారు. అభ్యర్థులకు ప్రశ్నలు ఒకేలా ఉండకుండా జంబ్లింగ్ విధానాన్ని తీసుకువచ్చామని, టెట్ (TET) పరీక్షను తప్పనిసరి చేస్తూ 20 శాతం వెయిటేజీ ఇచ్చామని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘వర్టికల్, హారిజాంటల్ పద్ధతి’లో అత్యంత శాస్త్రీయంగా ఈ డీఎస్సీని నిర్వహించామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, క్రీడాకారులకు ప్రాధాన్యతనిస్తూ గతంలో ఉన్న 29 స్పోర్ట్స్ కేటగిరీలను తమ ప్రభుత్వ హయాంలో 65కు పెంచామని వివరించారు.
ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వైకాపా ‘టీమ్ 11’ నేతలు.. తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్న వైకాపా నేతలు.. చివరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే ప్రశ్నించే స్థాయికి దిగజారారని లోకేష్ ధ్వజమెత్తారు. “నాపై ఎలాంటి అవినీతి మరకలు లేవు, ఎలాంటి కేసులు లేవు.. నేను ఎక్కడికైనా వస్తా, డీఎస్సీపై ఎక్కడైనా చర్చకు సిద్ధం” అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, అక్కడే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిద్దామని లోకేష్ ఘాటుగా సవాల్ విసిరారు.








