షాకింగ్ : కంప్యూటర్లో మనిషి మెదడు! AI తర్వాత ఇదే నెక్స్ట్ బిగ్ థింగ్?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఏదో ఓ రోజు …
మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఒక ప్రశ్న అడుగుతారు. కంప్యూటర్ కొన్ని సెకన్లు ఆలోచిస్తుంది. తర్వాత సమాధానం ఇస్తుంది.
మీకు తెలియదు… ఆ సమాధానం ఇచ్చింది కంప్యూటర్లోని చిప్ మాత్రమే కాదని. ఎక్కడో ఒక డేటా సెంటర్లో… చీకటి గదిలో… వేలాది సర్వర్ల మధ్య…
ఒక మనిషి మెదడు భాగం పనిచేస్తోందని.
అవును. కంప్యూటర్లో మనిషి మెదడు. ఇది భవిష్యత్తులో జరగబోయే సైన్స్ ఫిక్షన్ సీన్ కాదు. ఇప్పటికే మొదలైన ప్రయోగం. అక్కడ మనిషి కూర్చోలేదు. మెదడు కూడా లేదు. కానీ… మనిషి మెదడులో ఉండే జీవ కణాలు మాత్రం ఉన్నాయి. వాటిని ఒక యంత్రంతో కలిపారు. సింగపూర్‌లో ఇప్పుడు జరుగుతున్న ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 20 యూనిట్లతో కూడిన ఒక బయోలాజికల్ కంప్యూటింగ్ సిస్టమ్ ఇప్పటికే పరీక్షలో ఉంది. అసలేం జరుగుతోంది, ఎందుకీ ప్రయోగం
చిన్న గేమ్.. పెద్ద ప్రయోగం
ఈ విషయం తెలుసుకునే ముందు ఓ ప్రశ్న. కంప్యూటర్‌కు మనిషి మెదడు ఎందుకు కావాలి? జవాబు తెలుసుకోవాలంటే… ముందుగా మనం ఒకప్పుడు చిన్న వీడియో గేమ్ ఆడించిన కొన్ని జీవ కణాల దగ్గరకు వెళ్లాలి. అక్కడే ఈ కథ మొదలైంది. Pong అనే చిన్న గేమ్‌తో.
కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన Cortical Labs శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ల్యాబ్‌లో పెంచిన జీవ న్యూరాన్లను కంప్యూటర్‌తో అనుసంధానించారు. వాటికి ఒక పని ఇచ్చారు. Pong ఆడాలి. మొదట అది ఒక సాధారణ ప్రయోగంలా కనిపించింది. కానీ న్యూరాన్లు ఆటలోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌కు స్పందించడం మొదలుపెట్టాయి. తప్పు జరిగితే ఫీడ్‌బ్యాక్ మారింది. క్రమంగా వాటి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి.
అంటే… జీవ కణాలు కేవలం సిగ్నల్‌కు స్పందించడం కాదు. అనుభవం ఆధారంగా తమ స్పందనను మార్చుకుంటున్నాయి. అక్కడే ఒక ఆలోచన పుట్టింది. ఒక గేమ్ ఆడేంత నేర్చుకోగలిగితే… ఇవి మరింత క్లిష్టమైన కంప్యూటింగ్ పనుల్లో ఉపయోగపడతాయా? ఆ ప్రశ్న ఇప్పుడు ప్రయోగశాల గోడలు దాటి డేటా సెంటర్లోకి వచ్చింది.
ఇప్పుడు ల్యాబ్‌లో కాదు.. డేటా సెంటర్లో
సింగపూర్‌లో DayOne Data Centers, Cortical Labs, National University of Singapore కలిసి 20 యూనిట్ల CL1 బయోలాజికల్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాయి. ఇది సంప్రదాయ సర్వర్ ర్యాక్లా కనిపించవచ్చు. కానీ లోపల జరుగుతున్న పని మాత్రం పూర్తిగా భిన్నం. మానవ స్టెమ్ సెల్స్ నుంచి పెంచిన న్యూరాన్లను సిలికాన్ ఆధారిత హార్డ్‌వేర్‌తో అనుసంధానించారు.
ఎలక్ట్రికల్ సిగ్నల్స్ న్యూరాన్లకు చేరతాయి. వాటి స్పందనను సిస్టమ్ చదువుతుంది. ఆ స్పందన ఆధారంగా కంప్యూటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే సిలికాన్ యంత్రం ఒక జీవ వ్యవస్థతో కలిసి పనిచేస్తోంది. ఇదే ‘బయోలాజికల్ కంప్యూటింగ్’.
అసలు ఇక్కడ సీక్రెట్ ఏంటి?
మనిషి మెదడు ఒక అద్భుతమైన కంప్యూటర్‌లా పనిచేస్తుంది. కానీ అది సంప్రదాయ కంప్యూటర్‌లా పనిచేయదు. మన మెదడుకు ప్రతి నిర్ణయానికి భారీ మొత్తంలో డేటా అవసరం లేదు. కొన్ని ఉదాహరణలతో నేర్చుకుంటుంది. పరిస్థితి మారితే తన స్పందనను మార్చుకుంటుంది. అనుభవం నుంచి అడాప్ట్ అవుతుంది.
AI కూడా ఇదే సామర్థ్యాలను అనుకరించడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారీ కంప్యూటింగ్ పవర్, డేటా, విద్యుత్ అవసరం అవుతున్నాయి. ఇక్కడే బయోలాజికల్ కంప్యూటింగ్ ఆసక్తికరంగా మారుతోంది.
Cortical Labs ప్రకారం ఒక్క CL1 యూనిట్ సుమారు 30 వాట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. న్యూరాన్లను ప్రత్యేక లైఫ్-సపోర్ట్ వ్యవస్థ ద్వారా సుమారు ఆరు నెలల వరకు జీవించి ఉండేలా నిర్వహించవచ్చు.
అంటే ఒకవైపు AIకి పెరుగుతున్న విద్యుత్ అవసరం. మరోవైపు తక్కువ శక్తితో పనిచేసే జీవ కంప్యూటింగ్ వ్యవస్థ. ఇది ఇంకా GPUలకు ప్రత్యామ్నాయం కాదు. కానీ భవిష్యత్తులో ఏ పనికి ఏ రకమైన కంప్యూటింగ్ సరైనది? అనే ప్రశ్నను మార్చే అవకాశం ఉంది.
1,000 ‘బ్రెయిన్ యూనిట్లు’?
ప్రస్తుతం సింగపూర్‌లో 20 యూనిట్లతో ప్రయోగం మొదలైంది. తదుపరి దశలో దీన్ని 1,000 యూనిట్ల వరకు విస్తరించే అవకాశాన్ని భాగస్వామ్య సంస్థలు పరిశీలిస్తున్నాయి. అయితే టెక్నికల్ వాలిడేషన్, నియంత్రణ అనుమతులు అవసరం. ఇది విజయవంతమైతే…డేటా సెంటర్ అనే పదానికి మనం ఇప్పటివరకు ఊహించని అర్థం రావచ్చు. ఇప్పటివరకు అక్కడ సర్వర్లు ఉన్నాయి. రేపు అక్కడ GPUలు ఉంటాయి. మరి ఒక రోజు…జీవించి ఉన్న న్యూరాన్లతో పనిచేసే కంప్యూటింగ్ యూనిట్లు కూడా ఉండొచ్చు.
మరి ChatGPTని ఇది భర్తీ చేస్తుందా?
ఇప్పుడే కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. CL1 ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయి AI మోడళ్లను నడిపే GPUలకు ఇది ప్రత్యామ్నాయమని చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ దీని లక్ష్యం కూడా అదే కాకపోవచ్చు.
డేటా తక్కువగా ఉన్నప్పుడు నేర్చుకోవడం… పరిస్థితులు మారుతున్నప్పుడు అడాప్ట్ అవడం… జీవ వ్యవస్థలను మోడల్ చేయడం… ఇలాంటి ప్రత్యేకమైన పనుల్లో జీవ న్యూరాన్లు ఉపయోగపడతాయా అనేది అసలు పరీక్ష.
ఇప్పటిదాకా …
AI మనిషి మెదడును అనుకరించడానికి పుట్టింది. బయోలాజికల్ కంప్యూటింగ్ మాత్రం ఒక అడుగు వెనక్కి వెళ్లి అడుగుతోంది.
“మనిషి మెదడును అనుకరించడం ఎందుకు? దాని అసలు భాగాలనే ఉపయోగించలేమా?”








