కొత్త చోట నిద్ర ఎందుకు పట్టదు? అద్బుతమైన పరిష్కారం ఇదిగో
ఒక హోటల్ రూమ్‌లోకి వెళ్లారు. బెడ్ బాగుంది. ఏసీ సరిగ్గానే ఉంది. బయట పెద్దగా శబ్దం కూడా లేదు. అయినా రాత్రంతా ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంది. కళ్లు మూసుకున్నా నిద్ర పూర్తిగా పట్టదు. కాసేపటికే మెలకువ వస్తుంది. మళ్లీ నిద్రపోవడానికి సమయం పడుతుంది. ఉదయం లేచేసరికి… ఇంట్లో పడుకున్నంత ఫ్రెష్‌గా అనిపించదు.
ఇది మీకే జరుగుతున్న విచిత్రమైన విషయం కాదు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనుభవించే ఈ సమస్యకు సైన్స్ ఒక పేరు పెట్టింది — “First-Night Effect.” అంటే కొత్త ప్రదేశంలో మనం గడిపే మొదటి రాత్రి, మన మెదడు సాధారణంగా నిద్రించే విధానాన్ని మార్చుకోవడం.
మారింది బెడ్ కాదు… మెదడు!
సాధారణంగా మనం నిద్రపోతే శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. కానీ కొత్త ప్రదేశంలో పడుకున్నప్పుడు మెదడు మాత్రం పూర్తిగా ‘ఆఫ్’ అవ్వదు. అది చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూనే ఉంటుంది. కొత్త శబ్దం ఏంటి? తలుపు ఎక్కడుంది? బయట ఏం జరుగుతోంది? ఈ గది నిజంగా సురక్షితమేనా? మనకు ఇవేవీ ఆలోచనలుగా అనిపించకపోయినా, మెదడు మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పని చేస్తూనే ఉండొచ్చు.
అందుకే కొత్త ప్రదేశంలో మొదటి రాత్రి నిద్ర సాధారణంగా కొంత తక్కువగా, కొంత తేలికగా ఉంటుంది. నిద్రకు సంభందించిన పరిశోధనల్లో సగటున 20 నుంచి 30 నిమిషాల వరకు తక్కువ నిద్ర కనిపించిన సందర్భాలు ఉన్నాయి. కొందరిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు.
మన పూర్వీకుల కాలం నుంచే ఈ అలర్ట్ సిస్టమ్?
స్లీప్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ ‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’కు పరిణామక్రమంతో సంబంధం ఉండొచ్చు. మన పూర్వీకులకు కొత్త ప్రదేశం అంటే కేవలం కొత్త హోటల్ రూమ్ కాదు. అది అడవి కావచ్చు. తెలియని ప్రాంతం కావచ్చు. అక్కడ ప్రమాదం ఏదైనా ఉండొచ్చు. అందుకే పూర్తిగా తెలియని ప్రదేశంలో పడుకున్నప్పుడు మెదడు మొత్తం అప్రమత్తతను వదిలేయకుండా ఉండటం ఒక రక్షణ వ్యవస్థగా అభివృద్ధి చెంది ఉండొచ్చనే భావన ఉంది.
అంటే… శరీరం నిద్రపోతున్నా, మెదడు మాత్రం “ఇక్కడ అంతా సేఫేనా?” అని చెక్ చేస్తూనే ఉంటుంది. నిద్రలోనూ మెదడులో కొంత భాగం ‘వాచ్’లోనే!
పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధనల్లో కూడా కొత్త వాతావరణంలో నిద్రించే సమయంలో మెదడులోని కొన్ని ప్రాంతాలు ఎక్కువ చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా నిద్రలో లోతైన దశలకు సంబంధించిన ఫ్రంటల్ ప్రాంతంలో చురుకుదనం కనిపించింది. దీని అర్థం ఏమిటంటే… కొత్త ప్రదేశంలో మనం నిద్రపోయినా, నిద్ర నాణ్యత పూర్తిగా ఇంట్లో ఉన్నట్టుగా ఉండకపోవచ్చు.
వయసు పెరిగే కొద్దీ ప్రభావం ఎందుకు మారుతుంది?
ఈ ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు. పిల్లలు, టీనేజర్లు, వృద్ధుల్లో ‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ ఎక్కువగా కనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 20ల వయసులో ఉన్నవారిలో మాత్రం ఇది తక్కువగా కనిపించే అవకాశం ఉంది. అంటే వయసు కూడా మన నిద్ర, కొత్త వాతావరణానికి మెదడు స్పందించే విధానంపై ప్రభావం చూపుతుంది. అయితే కొత్త ప్రదేశం మాత్రమే కాదు. మనవాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు … ఆ ప్రదేశానికి మనం తీసుకెళ్లే భావోద్వేగాలు కూడా మనతో పాటు బెడ్‌పైకి వస్తాయి.
“ఈరోజు కూడా నిద్ర పట్టదు” అనుకోవడమే మరో సమస్య!
ఇక్కడ మన మెదడు మరో చిన్న ఆట ఆడుతుంది. మొదటి రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. రెండో రాత్రి పడుకునే ముందు… “మళ్లీ నిద్ర పట్టకపోతే?” అనే ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే మనలో ఆందోళన పెంచుతుంది. ఆందోళన పెరిగితే మెదడు మరింత అప్రమత్తంగా ఉంటుంది. మెదడు అప్రమత్తంగా ఉంటే నిద్ర మరింత ఆలస్యమవుతుంది. ఇలా ఒక చిన్న సమస్య… self-fulfilling prophecyగా మారుతుంది.
అందుకే సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉండే వ్యక్తుల్లో ‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ మరింత తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది.
మరి ఇంట్లోనే నిద్ర రాని వాళ్లకు?
ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. కొత్త ప్రదేశం కొందరికి సమస్య కాకపోవచ్చు. ఇంట్లోనే నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడే వ్యక్తులు, కొత్త ప్రదేశంలో కొన్నిసార్లు మెరుగ్గా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఇంట్లోని బెడ్, గది, సమయం… ఇవన్నీ గతంలో జరిగిన నిద్ర సమస్యలతో ముడిపడి ఉండొచ్చు.
మరి దీనికి పరిష్కారం
కొత్త చోట్లో నిద్రపట్టడానికి ఇంకో చిన్న ట్రిక్ కూడా ఉంది. మీకు ఇంట్లో నచ్చే దిండు, చిన్న దుప్పటి లేదా మరేదైనా పరిచయమైన వస్తువు వెంట తీసుకెళ్లడం కూడా మెదడుకు “ఇది సేఫ్ ప్లేస్” అనే భావన కలిగించడంలో సహాయపడవచ్చు.మాగ్జిమం వర్కవుట్ అవుతుంది.
అలాగే కొత్త బెడ్‌పై పడుకున్న వెంటనే నిద్రపోవాలని ప్రయత్నించకుండా, కొంతసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. పుస్తకం చదవడం లాంటి పరిచయమైన పనిని చేయవచ్చు.
ముఖ్యమైన మీటింగ్ ఉంటే… ఒక రాత్రి ముందే వెళ్లడం మంచిది. ఇక్కడ నిద్ర నిపుణుల సలహా చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. రేపు మీకు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఇంటర్వ్యూ ఉంది. ఎగ్జామ్ ఉంది. ప్రెజెంటేషన్ ఉంది. అలాంటి సమయంలో అదే రోజు కొత్త నగరానికి వెళ్లి, అదే రాత్రి కొత్త హోటల్లో పడుకోవడం కంటే…
ఒక రాత్రి ముందే వెళ్లడం మంచిది. మొదటి రాత్రి మెదడు కొత్త ప్రదేశానికి అలవాటు పడుతుంది. రెండో రాత్రికి పరిసరాలు కొత్తగా అనిపించకపోవచ్చు. అప్పుడు మీరు కూడా… ఇంట్లో నిద్రపోయినట్టే నిద్రపోయే అవకాశం పెరుగుతుంది.
చివరికి విషయం ఇదే…
మనిషి ఎంత ఆధునికంగా మారిపోయినా, మెదడు మాత్రం కొన్ని విషయాల్లో ఇప్పటికీ చాలా పాతదే.
ఈరోజు మనం హోటల్లోని లాక్‌ను చూసి సేఫ్‌గా ఉందని తెలుసుకుంటాం. సీసీ కెమెరాలు ఉన్నాయని తెలుసుకుంటాం. రూమ్ సర్వీస్ ఉందని తెలుసుకుంటాం. కానీ మన మెదడు మాత్రం అంత సులభంగా నమ్మదు.
“ఇది కొత్త ప్రదేశం. ముందు ఒక రాత్రి గమనిద్దాం…” అంటూ తన చిన్నపాటి సెక్యూరిటీ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచుతుంది. అందుకే కొత్త ప్రదేశంలో మొదటి రాత్రి నిద్ర సరిగ్గా రాకపోతే… అది మీ నిద్ర పోయిందని కాదు. మీ మెదడు ఇంకా ఆ ప్రదేశాన్ని ‘మనది’గా అంగీకరించలేదేమో.
మరి విచిత్రమైన విషయం ఏమిటంటే — మనం నిద్రలో ఉన్నామని అనుకున్న సమయంలో కూడా, మన మెదడు మాత్రం మన కోసం కాపలా కాస్తూనే ఉంటుంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








