‘మారుతి’ ఎలా ‘హనుమాన్’ అయ్యాడు? అసలు ఆ రోజు ఏం జరిగింది?
హనుమంతుడంటే మనందరికీ చాలా ఇష్టం. ఆయన చాలా బలవంతుడు. చాలా ధైర్యవంతుడు. అన్నింటికంటే ముఖ్యంగా.. శ్రీరాముడిని ఎంతో ప్రేమించిన భక్తుడు. కష్టం వచ్చినప్పుడు పెద్దలు హనుమంతుడిని తలుచుకుంటారు. “హనుమంతుడిలా ధైర్యంగా ఉండాలి” అంటారు.
మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా?
హనుమంతుడి చిన్నప్పుడు ఆయన పేరు హనుమంతుడు కాదు! ఆయనను మారుతి అని పిలిచేవారు. మరి మారుతి ఎలా హనుమంతుడయ్యాడు? దాని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకరోజు బుల్లి మారుతి బయటికి వచ్చి ఆకాశం వైపు చూశాడు.అక్కడ మారుతికి సూర్యుడు కనిపించాడు.అయితే ఆయనే సూర్యుడు అని తెలియదు. సూర్యుడు ఆయనకు పెద్దగా, ఎర్రగా, అందంగా ఓ బంతిలా కనిపించాడు.
“అరే! ఎంత పెద్ద పండు!” అనుకున్నాడు.
అంతే. ఆ పండు తనకు కావాలి.
మారుతి ఒక్కసారి పైకి చూశాడు.
తర్వాత.. ఒకే ఒక్క దూకుడు! ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
మారుతి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? మనం ఊహించనైనా ఊహించలేని సూర్యుడి దగ్గరకు! సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్తున్నాడు! మారుతి చాలా వేగంగా ఆకాశంలోకి దూసుకెళ్లాడు.సూర్యుడు ఇంకా దూరంగా ఉన్నాడు. మారుతి మాత్రం.. “ఆగు! నిన్ను పట్టుకుంటా!” అన్నట్టుగా అతని వైపు వెళ్తూనే ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడి శక్తి చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇంద్రుడికి మాత్రం భయం వేసింది.
ఎందుకంటే మారుతి సూర్యుడిని చేరుకుంటున్నాడు. ఆ పిల్లాడని ఆపాలని ఇంద్రుడు నిర్ణయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. దాని పేరు వజ్రాయుధం. మారుతిని ఆపడానికి ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు.
అది వెళ్లి.. మారుతి దవడకు తగిలింది. మారుతి కిందపడిపోయాడు. అది చూసి మారుతి తండ్రి వాయుదేవుడు చాలా బాధపడ్డాడు. “నా బిడ్డకు ఇలా ఎలా జరిగింది?” అని ఆయన కలత చెందాడు.
అప్పుడు ఏమైందో తెలుసా? వాయుదేవుడు తన శక్తిని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు ప్రపంచంలో గాలి అనేది లేకుండా పోయింది.
మనకు గాలి లేకపోతే ఏం అవుతుంది? శ్వాస తీసుకోలేం కదా! అందుకే దేవతలందరూ ఆందోళన చెందారు. వాయుదేవుడిని శాంతింపజేయడానికి వాళ్లంతా మారుతి దగ్గరకు వచ్చారు. అప్పుడు మారుతికి ఒక్కొక్క దేవుడు ఒక్కో వరం ఇచ్చాడు.
“ఇక నుంచి నీకు అపారమైన శక్తి ఉంటుంది.”
“నీకు జ్ఞానం ఉంటుంది.”
“చాలా ప్రమాదాల నుంచి నిన్ను రక్షిస్తాం.”
అలా చిన్న మారుతికి ఎన్నో అద్భుతమైన వరాలు లభించాయి.
ఆగండి.ఇంకా కథ అయ్యిపోలేదు. ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంది.
మారుతి పేరు ఎలా హనుమంతుడైంది? ఇంద్రుడి వజ్రాయుధం మారుతి దవడకు తగిలింది కదా!
సంస్కృతంలో దవడను ‘హను’ అంటారు. అందుకే ఆ సంఘటనతో మారుతికి హనుమాన్ అనే పేరు ప్రసిద్ధి చెందిందని పురాణలు చెప్తున్నాయి.
అంటే..ఒకప్పుడు మారుతి అని అందరూ పిలిచిన ఆ చిన్న పిల్లాడే.. తర్వాత మనందరికీ తెలిసి హనుమంతుడయ్యాడు.
మారుతికి చిన్నప్పటి నుంచే చాలా శక్తి ఉంది.
కానీ ఆ శక్తిని తన గొప్పతనం చూపించడానికి ఉపయోగించలేదు. తర్వాత శ్రీరాముడు అతని జీవితంలోకి వచ్చాడు. అప్పుడే మారుతికి తన శక్తికి తగ్గ ఒక గొప్ప పని దొరికింది.
శ్రీరాముడు కోసం హనుమంతుడు సముద్రం దాటాడు. సీతమ్మను వెతికాడు. లంకలోకి వెళ్లాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని కోసం పర్వతాన్ని తీసుకొచ్చాడు.
ఇంత శక్తి ఉన్నా.. హనుమంతుడు ఎప్పుడూ “నేనే గొప్ప” అని చెప్పుకోలేదు. అందుకే హనుమంతుడు మనకు కేవలం బలవంతుడైన దేవుడు కాదు. బలం ఉంటే అహంకారం అవసరం లేదని చెప్పే దేవుడు. ధైర్యం ఉంటే ఇతరులకు సహాయం చేయాలని నేర్పే దేవుడు. మనకు ఎంత శక్తి ఉన్నా.. దాన్ని మంచి పని కోసం ఉపయోగించాలని గుర్తు చేసే దేవుడు. అందుకే మనం హనుమంతుడిని అంతగా ప్రేమిస్తాం.
ఇదే మారుతి…హనుమంతుడిగా మారిన అద్భుతమైన కథ.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








